పవన్‌ సభ...ఫెయిల్యూర్స్‌ ఇవే!

పవన్‌ సభ...ఫెయిల్యూర్స్‌ ఇవే!

సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభ అంచనాలకు మించి సక్సెస్‌ అయింది. అయితే, జనం అంచనాలకు తగినట్లుగా ఆఖరికి అభిమానులు కూడా అంచనా వేసిన విధంగా పవన్‌ ప్రసంగం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినిమా డైలాగులు, వెంట తెచ్చుకున్న స్క్రిప్టుతో జనాలను, ముఖ్యంగా యువకులతో ఈలలు వేయించుకోవడానికే పరిమితమయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను బీజేపీ, టీడీపీ నడిపిస్తే నడిపించేవాడినా? అంటూ హుంకరించిన పవన్‌, బిజెపిని విమర్శించి, తెదేపాను బంతిపూలతో కొట్టడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో, రెండుసార్లు లేఖ ఇచ్చిన తెదేపాకూ అంతే పాత్ర ఉందన్న విషయాన్ని విస్మరించారంటున్నారు. పైగా తనకు తెదేపాపై ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పడం, ఆ పార్టీని నామమాత్రంగా విమర్శించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీపరంగా పోటీకి పిలుపిస్తారని వారు ఆశించారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని ఆశలు పెట్టుకున్నారు. వీటిపై పవన్‌ స్పష్టతనివ్వలేదు. అలాగే పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా చర్చించలేదు. ఆఖరకు  జరిగే బంద్‌లో పాల్గొనే అంశాన్ని కూడా కారకర్తలకే వదిలేశారు. దీనిపై కూడా పార్టీపరమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పిలుపుమేరకు ఈనెల  నిర్వహించనున్న బంద్‌పై పవన్‌ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా, అది మీ ఇష్టమని, అయినా మీరెందుకు రోడ్లపైకి వెళ్లాలని, పదవులు తీసుకున్నవాళ్లున్నారు కదా? మీరు ఉద్యోగాలు చూసుకోండని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రత్యేక హోదాపై పోరాడతానని చెబుతూ, అదే డిమాండ్‌తో ప్రతిపక్షాలు రాష్ట్ర బందుకు పిలుపునిస్తే, దానిని సమర్థించకపోవడం బట్టి పవన్‌ సభ ఎవరి కోసం? ఎందుకోసం నిర్వహించారన్నది స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజంగా పవన్‌కు హోదాపై చిత్తశుద్ధి ఉంటే విపక్షాల రాష్ట్ర బందుకు తాను సహకరిస్తానని చెప్పేవారని, దానిబదులు మీ ఇష్టమని వ్యాఖ్యానించారంటే బందుకు సహకరించవద్దనే అర్ధమని చెబుతున్నారు. ఆ రకంగా పవన్‌ అధికారపార్టీ ధోరణి ప్రదర్శించారంటున్నారు. రేపు తన పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, వాటికి కూడా మీకు ఇష్టం ఉంటే రండి అని చెబుతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ ఊపిరిపోసుకునేందుకు మరో పదేళ్లు పడుతుంది. ఆ పార్టీ నేతలంతా మనుగడ కోసం తెదేపా-వైకాపాలో చేరుతున్నారు. అయినా ఆ పార్టీ గురించి ఇంకా మాట్లాడటంలో అర్ధం లేదంటున్నారు. ఇక బీజేపీ బలం నామమాత్రమేనని గుర్తు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు పేరుకు జాతీయ పార్టీయినప్పటికీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల కిందే లెక్క. అలాంటి బలం లేని పార్టీలను విమర్శించిన పవన్‌, సమానమైన బలం ఉండి, విభజనకు కారణమయిన తెదేపా-వైకాపాను విమర్శించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే, బీజేపీ గుండెల్లో పొడిచిందన్న పవన్‌, రెండుసార్లు విభజన లేఖ ఇచ్చిన తెదేపాను, ఏవిధంగా రాష్ట్రాన్ని విభజించవచ్చో చెప్పిన వైకాపాను విమర్శించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. చంద్రబాబుకేంద్రం ఇచ్చిన పాచిపోయిన రెండు లడ్లను తీసుకుంటారా లేదా? అన్నది చూడాలన్న పవన్‌, ప్యాకేజీని సమర్ధించిన తీరుపై పల్తెత్తు విమర్శ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలోని విపక్షాలు, ప్రజాసంఘాలన్నీ హోదా లేని ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్‌పై భగ్గుమంటుంటే, తనదీ రాజకీయ పార్టీ అని చెప్పిన పవన్‌ మాత్రం, ప్యాకేజీని సమర్థించిన ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమయిన విశాఖ జోన్‌పై ఒక్కమాట మాట్లాడకుండా మౌనం వహించడం వల్ల రాజకీయంగా వేరే సంకేతాలు వెళతాయంటున్నారు. సభలో పవన్‌ ప్రసంగం తీరు ఇక ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా లేదని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా పవన్‌కు లభించిన ఆదరణ జనసైనికుల్ని ఉత్సాహంలో నింపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English