ప్యాకేజీ ముసాయిదాలో ఆ 3 పదాలు రిజెక్ట్‌ చేసిన బాబు

ప్యాకేజీ ముసాయిదాలో ఆ 3 పదాలు రిజెక్ట్‌ చేసిన బాబు

రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఫస్ట్‌ నుంచి డిమాండ్‌ చేస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు.. ఈ విషయంలో తన కొడుకే అడ్డం వచ్చిన సహించబోనని ఆ మధ్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎప్పటిలాగే.. కేంద్రం మాత్రం ప్యాకేజీతోనే ఏపీ సమస్యకు ముగింపు పలకాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన చర్చలు రాత్రి వరకు సాగాయి. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, వెంకయ్యనాయుడును పక్క పక్కనే కూర్చోబెట్టుకుని మరీ జైట్లీ ఏపీకి లెక్కలు తేల్చేశారు. హోదా ఇవ్వడం కుదరదని.. ప్యాకేజీకి కట్టుబడ్డామని పేర్కొంటూ ఏమేం ఇవ్వాలనుకుంటున్నామంటే.. అని మొదలు పెట్టి మొత్తంగా ఏడు పేజీల ముసాయిదాను వండి వార్చిన జైట్లీ.. దానిని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబుకు పంపారు.

వాస్తవానికి ముసాయిదా రూపకల్పన సమయంలోనే చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ప్యాకేజీ కి ఫైనల్‌ షేప్‌ ఇస్తున్నామని, మీరు కూడా ఉంటే బాగుంటుందని అన్నారు. అయితే, ఎలాగూ హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను రానులే అని చంద్రబాబు మెసేజ్‌ పెట్టడంతో ముసాయిదా కాపీని బాబు పరిశీలన కోసం జైట్లీ విజయవాడకు పంపారు. ఇది అందగానే పూర్తి స్థాయి అక్షరం అక్షరం విడిచి పెట్టకుండా చదివారు చంద్రబాబు. ఇలా ఒక్కసారి కూడా కాదు  ముసాయిదాను మొత్తం 10 సార్లు ఆయన చదివినట్టు సమాచారం. ఈ సందర్భంగా ముసాయిదాలో ఆర్థిక శాఖ పేర్కొన్న పదాలపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా  ''చేస్తాం, చూస్తాం, పరిశీలిస్తాం'' తరహాలో ఉన్న మూడు పదాలను పూర్తిగా ఖండించారు.

 ఇలాంటి పదాలతో మొదటికే మోసం వస్తుందని, ఈ పదాలను తొలిగించి పూర్తిస్థాయిలో మరోసారి ముసాయిదా తయారు చేయాలని ఆయన కరాఖండీగా తేల్చి చెప్పారు. అంతేకాకుండా..  అలాంటి పదాలకు ప్యాకేజీలో చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. తనకు ఫోన్‌ చేసిన కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్యలకూ ఇదే అంశాన్ని తెలిపారు. ఈ ముసాయిదా రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అందులో పలుమార్పులు చేర్పులకు పట్టుబట్టారు. దీంతో ఆఖరి నిమిషంలో జైట్లీ ఆదేశాల మేరకు ముసాయిదా మరోసారి తయారైంది. దీనివల్లే.. ఏపీపై మధ్యాహ్నమే వస్తుందనుకున్న కేంద్రం ప్రకటన అర్థరాత్రి వరకు ఆలస్యమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English