పవర్‌స్టార్‌ను టార్గెట్‌ చేసిన డిప్యూటీ సీఎం

పవర్‌స్టార్‌ను టార్గెట్‌ చేసిన డిప్యూటీ సీఎం

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తన స్టైల్లో టార్గెట్‌ చేశారు. ఏడాదికి ఒక్కసారి వేదికలెక్కి మీటింగ్‌లు పెట్టే రకం తాము కాదంటూ సటైర్లు రువ్వారు. సాధారణంగా పాలిటిక్స్‌ అన్నాక ఏదో ఒకరకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్‌. కానీ, తమ మిత్రపక్షం, 2014లో టీడీపీ, బీజేపీలకి ప్రచారం చేసిన

పవన్‌పైనే ఇప్పుడు డిప్యూటీ సీఎం కేఈ విమర్శలు చేస్తుండడం ఆసక్తిగా మారింది. ఇటీవల తిరుపతి బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, కేంద్రం దగ్గర ఏపీ పరువును తాకట్టు పెడుతున్నారని, మన వాళ్లకి సార్‌ సార్‌ అనడం తప్ప ఏమీ రాదని, హిందీ నేర్చుకుంటే కొంచెమైనా ఢిల్లీ వాళ్లకి అర్థమయ్యేలా మన ఆవేదనను చెప్పుకొనే వీలుంటుందని ఆయన అన్నారు.

కొందరు మంత్రుల వైఖరిని కూడా పవన్‌ ఈసందర్భంగా తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం తనవంతు పోరాటం చేస్తానని పవన్‌ చెప్పారు. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా భరిస్తామని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూనే ఉన్నారు కేఈ. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని ఆయన అన్నారు. దీనికోసం కేంద్రంతో తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఆయన చెబుతూ వస్తున్నారు. అదేసమయంలో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. తమ పోరాటం నిరంతరంగా సాగుతూనే ఉంటుందని, కేవలం ఒక సభ పెట్టి ఒక పిలుపు ఇచ్చి.. తర్వాత దానిని మరిచిపోయే రకం కాదని విమర్శలు సంధించారు.

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని కేఈ చెప్పుకొచ్చారు. రాబోయే రెండున్నరేళ్లలో విభజన హామీలన్నీ అమలవుతాయని ఆశిస్తున్నామని కేఈ చెప్పారు. ఇదే సమయంలో విపక్షం వైకాపాపై కేఈ నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్‌ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని జగన్‌ అడుగడుగునా అడ్డుకుంటున్నారని అన్నారు. ఏపీ అభివృద్ధి కేవలం చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు. అయితే, కేఈ.. పవన్‌ గురించి ఇన్‌డైరెక్ట్‌గా చేసిన కామెంట్ల నేపథ్యంలో తాజాగా శుక్రవారం కాకినాడలో పవన్‌ నిర్వహించే సభపై ఇంకెలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English