వైకాపాకు వార్నింగ్‌: లోటస్‌పాండ్‌ రూల్స్‌ ఇక్కడ వర్తించవు

వైకాపాకు వార్నింగ్‌: లోటస్‌పాండ్‌ రూల్స్‌ ఇక్కడ వర్తించవు

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైకాపా సభ్యులు చేస్తున్న ఆందోళనతో ఏపీ అసెంబ్లీ రగిలిపోతోంది! ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ వైకాపా చేస్తున్న డిమాండ్‌తో సభా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. గురువారం అసెంబ్లీ భేటీ అయిన తొలిరోజు మొదలై ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. ప్రత్యేక ప్యాకేజీకి ఆహ్వానం పలకడంపై చంద్రబాబు క్షమాపణ చెప్పితీరాలని, రాజీనామా సమర్పించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ డిమాండ్‌ చేసిన నేపథ్యలో ఆ పార్టీ సభ్యులు మరింతగా రెచ్చిపోయారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదా కోసం చర్చ చేపట్టాలని వైకాపా సభ్యులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో జోక్యం చేసుకున్న మంత్రి యనమల రామకృష్ణుడు దీనిపై సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేస్తారని, తర్వాత చర్చకు అనుమతి ఉంటుందని అన్నారు.  లోటస్‌ పాండ్‌ రూల్స్‌ ఇక్కడ వర్తించవని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. సభా నియమాల ప్రకారం ముందు చర్చ జరగాలని, ఆ తర్వాతే ప్రభుత్వం ప్రకటన చేయాలని వైకాపా సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య రాజీ కుదరకపోయే సరికి వైకాపా సభ్యులు చర్చకు పట్టుబడుతూ.. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

సీనియర్‌ సభ్యులు చెబుతున్నారని.. వైకాపా సభ్యులు వినాలని అన్నారు. ఈ క్రమంలో మరింతగా రెచ్చిపోయిన వైకాపా సభ్యులను అడ్డుకునేందుకు అసెంబ్లీ మార్షల్స్‌ రంగంలోకి దిగారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి.. స్పీకర్‌పైకి దూసుకువస్తున్న వైకాపా సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైకాపా సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోడియవద్దే కింద పడిపోయారు. అనంతరం పైకి లేచి మరీ ఆందోళన చేశారు. ఈ క్రమంలో సభను స్పీకర్‌ పది నిమిషాలపాటు వాయిదా వేశారు.

ఈ సందర్భంగా బయటకు వచ్చిన చెవిరెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌ తమ హక్కులను కూడా హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియంను ముట్టడించడం అనేది ఇప్పుడున్నది కాదని, సభలో అభ్యంతరం వ్యక్తం చేసేందుకు విపక్ష సభ్యులకు ఉన్న వెసులుబాట్లలో ఇదొకటని ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. ఓటుకు నోటు కేసు కోసం తెలుగు ప్రజల జీవితాలను నాశనం చేయవద్దని చంద్రబాబును కోరారు. అసెంబ్లీలో తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు