బ్లాక్‌ షర్ట్‌ కొనటం ఆలస్యమైందా జగన్‌?

బ్లాక్‌ షర్ట్‌ కొనటం ఆలస్యమైందా జగన్‌?

సీమాంధ్రులకు మించిన దురదృష్టవంతులు వేరెవరూ ఉండరేమో? వ్యక్తిగత ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా ఏపీ గురించి..ఆ రాష్ట్ర ప్రయోజనాల మీద మాత్రమే మాట్లాడే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారంటే లేరనే చెప్పాలి. రాజకీయ పార్టీలు చాలానే ఉన్నా.. ఏపీకి జరిగిన.. జరుగుతున్న అన్యాయం మీద తీవ్రస్థాయిలో గళం విప్పే సీన్‌ అటు ఏపీ అధికారపక్షానికి.. ఇటు విపక్షానికి లేని పరిస్థితి. ఈ వైఖరి సీమాంధ్రుల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఒక రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే.. అధికారపక్షం నుంచి విపక్షాల వరకూ విలవిలలాడిపోతాయి. తమకు జరిగిన అన్యాయాన్ని తీవ్రస్థాయిలో ఖండించటం.. నిరసనలు పెద్ద ఎత్తున నిర్వహించటం చేస్తుంటారు.

అలాంటివేమీ ఏపీలో కనిపించవు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో రాజీ పడ్డారనే అనుకుందాం. మరి.. ప్రధానప్రతిపక్ష నేత జగన్‌ ఏం చేశారన్న సూటి ప్రశ్న వేసుకుంటే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. జైట్లీ వెల్లడించిన ప్యాకేజీ మీద బాబు స్పందనను మాత్రమే తప్పుపట్టారు. అంతకుమించి జైట్లీని కానీ.. ప్రధాని మోడీని కానీ ఒక్క మాటంటే ఒక్కమాట అనకపోవటాన్ని మర్చిపోకూడదు.

ఏపీకి ఇంత అన్యాయం ఎందుకు చేస్తారని సూటిగా జగన్‌ ఎందుకు మాట్లాడరన్నది పెద్ద ప్రశ్న. ఆ సందేహాన్ని జగన్‌ తో సహా ఆయన పార్టీకి చెందిన నేతలెవ్వరూ తీర్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించరు. ఎంతసేపటికి ఏపీ ముఖ్యమంత్రి తీరును ప్రశ్నించే జగన్‌.. ఆయనవరకూ ఆయనేం చేశారన్నది చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఏపీకి ఇచ్చే వరాలమూట ఏమిటన్న ఆసక్తి ప్రతి సీమాంధ్రుడిలో వ్యక్తమైంది. అర్థరాత్రి వరకూ జైట్లీ మాటల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూడటాన్ని మర్చిపోలేం. తర్వాత చంద్రబాబు స్పందనను  ఆసక్తిగా విన్నారు.

అయితే.. ఈ రెండింటిలోనూ సీమాంధ్రుడు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్‌ స్పందన కోసం కొందరు ఎదురుచూశారు. కానీ.. ఆయన కానీ.. ఆయన పార్టీకి చెందిన వారి స్పందన కానీ టీవీల్లో ఎక్కడా కనిపించలేదు. ఒకకీలకాంశానికి సంబంధించి జగన్‌ ఎందుకు స్పందించలేదు? అర్థరాత్రి వేళ రియాక్షన్‌ ఎందుకని ఊరుకున్నారో? సరైన అధ్యయనం చేయకుండా మాట్లాడితే ఇబ్బందని భావించారో? కానీ మౌనంగా ఉన్నారు. ఉదయానికి కూడా జగన్‌ సిద్ధం కాలేదని చెప్పాలి.

గురువారం అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చిన జగన్‌.. తమ నిరసనలో భాగంగా నల్లచొక్కా మాత్రం వేసుకొచ్చారు. ఈ సందర్భంగా కొందరు జగన్‌ తీరుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకోవటం కనిపించింది. ''రాత్రంతా అడ్రస్‌ లేని పెద్దమనిషి.. పొద్దున కూడా అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చారే. ఇంతకీ ఎందుకంత ఆలస్యమైందంటావ్‌'' అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తే.. కొందరు దీనికి బదులిస్తూ.. ''బ్లాక్‌ షర్ట్‌ కొనుక్కురావటానికి లేటు అయి ఉంటుంది'' అని వ్యాఖ్యానించటం వినిపించింది. కామెడీగా అనిపించినా.. లోతుగా ఆలోచిస్తే.. ఈ వ్యంగ్యంలోని ఆవేదన ఇట్టే అర్థమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు