బాబును మోడీ టీం గుర్తించింది

బాబును మోడీ టీం గుర్తించింది

కొన్ని నెలలుగా ఏపీలో హాట్‌ టాపిక్‌ గా మారిన ప్రత్యేక హోదా అంశానికి తనదైన రీతిలో శుభం కార్డు వేయాలని భావిస్తోంది మోడీ సర్కారు. ఇందులో భాగంగా తర్జనభర్జనల అనంతరం.. హోదా కాదు.. ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా ముగిసి.. ఫలితాలు వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతా చేసిన తర్వాత.. మిత్రపక్షంగా ఉన్న బాబు కానీ పెదవి విరిస్తే జరిగే నష్టాన్ని అర్థం చేసుకున్న కేంద్రం.. బాబును ప్రసన్నం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది.  బాబును సంప్రదించకుండా తీసుకునే నిర్ణయంతో తమకు షాకులే తప్పించి.. సానుకూలంగా స్పందన ఉండదన్న విషయాన్ని కమలనాథులు అర్థం చేసుకున్నట్ల కనిపిస్తోంది.

మారిన మోడీ బ్యాచ్‌ మైండ్‌ సెట్‌ కు తగ్గట్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హస్తిన నుంచి ఫోన్‌ వచ్చింది. తరచూ ఢిల్లీకి వస్తానంటే వద్దంటూ బ్రేకులు వేసే మోడీ అండ్‌ కో.. ఇప్పుడు అందుకు భిన్నంగా అర్జెంట్‌ గా ఢిల్లీకి రావాలని కోరటం గమనార్హం. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి నుంచి ఫోన్‌ వచ్చిన నేపథ్యంలో బాబు ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ మధ్యాహ్నానానికి కేంద్రం నుంచి ఏపీకి అందే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన వివరాలు బయటకువస్తాయని భావించారు.

అయితే.. బయటకు వివరాలు వెల్లడించే ముందు మిత్రపక్షమైన ఏపీ ముఖ్యమంత్రితో తాము తీసుకున్న నిర్ణయాన్ని చెప్పి.. ఆయన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత విడుదల చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో బాబును ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. ఏపీకి కేంద్రం ప్రకటించే ప్యాకేజీలోని అంశాల్ని వివరించటంతోపాటు.. తమ ఆలోచనల్నిబాబుతో పంచుకుంటారని చెబుతున్నారు. తాజా పరిణామాల్ని చూస్తే.. ఏపీకి సంబంధించిన ఏ అంశంలో అయినా బాబు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న బావనకు మోడీ సర్కారు రావటం గమనార్హం. ఇప్పటికే బయటకు వచ్చిన అంశాల ప్రకారం అయితే.. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అంతంతమాత్రంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే ప్యాకేజీ కనుక కేంద్రం ఫైనల్‌ చేసి ఉంటే బాబు ఏమంటారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారిందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు