వైకాపా ఎమ్మెల్యే హౌస్‌ అరెస్టు

వైకాపా ఎమ్మెల్యే హౌస్‌ అరెస్టు

ఏపీలో విపక్ష వైకాపాకు చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. తుని సమీపంలో దివీస్‌ లాబ్‌ కు ప్రభుత్వం అనుమతినివ్వడం, దీనికి అవసరమైన భూమిని రైతుల నుంచి తీసుకోవడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో వివాదానికి దారితీసింది. రైతులకు ఇష్టం లేకుండా, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొంటోందని, దివీస్‌ వల్ల స్థానికంగా రైతులు తమ ఉపాధిని కోల్పోతారని ఆరోపిస్తున్న సీపీఎం నేతలు, రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీపీఎం బహిరంగసభకు వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి మద్దతిచ్చారు.

దీంతో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరేలా ఏర్పాట్టు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రంగం ప్రవేశం చేసిన పోలీసులు పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల వద్ద భారీ బలగాలను మోహరించారు. అదేసమయంలో ఎమ్మెల్యే దాడిశెట్టిని గృహ నిర్బంధం చేశారు. ఆయా పరిసరాల్లో 144 సెక్షన్‌ను కూడా విధించారు. దీనిపై దాడిశెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, తనను హౌస్‌ అరెస్టు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు దివీస్‌ నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు తీసుకుని... ఇక్కడ ఆ కంపెనీకి అనుమతులు వచ్చేలా చేశారని ఆరోపించారు.  రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదని ,బలవంతపు భూ సేకరణకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక, సీపీఎం నేతలు కూడా ప్రభుత్వ చర్యలను విమర్శిస్తున్నారు.  రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారని సర్కారు చెబుతున్నా.. అందులో వాస్తవం లేదని, రైతులు ఈ భూసేకరణపై అయిష్టత చూపుతున్నారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా.. ఎమ్మెల్యే హౌస్‌ అరెస్టుతో తునిలో రాజకీయం వేడెక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు