కేసీఆర్‌కి గవర్నర్‌ చురకలా..!

కేసీఆర్‌కి గవర్నర్‌ చురకలా..!

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జల సంబంధమైనవి అనేకం వచ్చాయి. అయితే, ఆయా సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాలకూ పెద్ద దిక్కుగా ఉన్న గవర్నర్‌ ఏదైనా చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, గవర్నర్‌ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఈ క్రమంలో అందరూ గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని, ఆ రాష్ట్ర సీఎం విధానాలకు కొమ్ముకాస్తున్నారని కామెంట్లు చేశారు. అయితే, ఇప్పుడు తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌.. టీ సీఎం కేసీఆర్‌కు సైలెంట్‌గానే చురకలంటించారు. సీఎం కేసీఆర్‌ స్పీడు పెంచాలని అన్నారు.

నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  చదువుల తల్లి సరస్వతిని లక్ష్మిగా మారుస్తున్నారని అన్నారు.  తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిందని, ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీడ్‌ పెంచాలని నరసింహన్‌ సూచించారు. ప్రజాప్రతినిధులు ఒకసారి విద్యా వ్యవస్థపై దృష్టి సారించాలన్నారు.  విద్యలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భాగంగా ఉండాలని చెప్పారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లేకపోతే మేకిన్‌ ఇండియా తయారు కాదని, జాగృతి సంస్థ సమాజం మొత్తాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజినీరింగ్‌ పాసైన వ్యక్తి అటెండర్‌ ఉద్యోగం చేయడం కన్నా దురదృష్టకరం మరొకటి ఉండదన్నారు. అయితే, వీటన్నింటికన్నా.. గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ఒకటి రెండు పొలిటికల్‌ కామెంట్లే ఇప్పుడు చర్చకు దారితీశాయి. కేసీఆర్‌ స్పీడ్‌ పెంచాలని అనడంపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అంటే, ఏపీ సీఎం  చంద్రబాబు స్పీడ్‌గా ఉన్నారనే అర్ధం కదా! దీనిని బట్టి గవర్నర్‌ తన స్టైల్‌లో కేసీఆర్‌కి సైలెంట్‌గానే క్లాస్‌ ఇచ్చేస్తున్నారన్న అభిప్రాయం పొలిటికల్‌ ఎనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ విపక్షాలకి కలిసొచ్చేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు