బాబు బాధః నన్ను డిస్ట్రబ్‌ చేస్తున్నారు

బాబు బాధః నన్ను డిస్ట్రబ్‌ చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. కడప జిల్లా రాయచోటి మండలం మాధవరం పంచాయతీ కంచరపల్లి కాలనీలో ఎండిన వేరుశనగ పంటను పరిశీలించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 'అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న నన్ను బాగా డిస్టర్బ్‌ చేస్తున్నారు. నన్ను అడ్డుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ఉన్మాది చేష్టలతో రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు' అని మండిపడ్డారు. 'రాయలసీమను కరువు రహిత సీమగా మారుస్తా.. హంద్రీ-నీవా ద్వారా చెరువులన్నింటినీ నీటితో నింపుతా.. గోదావరి-కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేస్తా అని అన్నారు. రాయచోటి ప్రాంతంలో వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్లకు వెళ్లే సమీప గ్రామాలకు తాగునీటి సదుపాయం కల్పిస్తామని, అనుసంధానం అనంతరం సోమశిలకు నీటిని తరలించి అక్కడి నుంచి రాయచోటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌ పట్టిసీమ, పోలవరం, రాజధాని అభివృద్ధి పనులను ఉన్మాదంతో అడ్డుకుంటున్నాడని చంద్రబాబు విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తే ఉభయ గోదావరి జిల్లాలు ఎడారిగా మారుతాయని రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో గతంలో తుపాకులు కనిపించేవని, ప్రస్తుతం తాను రెయిన్‌గన్‌లతో ముందుకొస్తున్నానని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి అన్నారు. రెయిన్‌గన్‌ల సరఫరా విషయంలో కొందరు అడ్డుపడడంతో ఆలస్యమైందన్నారు. దీనివెనుక ప్రతిపక్ష నాయకుడే ఉన్నాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లాలో ఆయన మూడో రోజు పర్యటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టర్లనూ, అధికారులనూ హెచ్చరించారు. 'నా ఓపికను, సహనాన్ని పరీక్షించొద్దు.. ఇప్పటికే రెండేళ్లు వేచి చూశాను. ఇకపై చూసేది ఉండదు. సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతే అన్నీ మానుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో రాయలసీమ నాలుగు జిల్లాల జలవనరుల శాఖాధికారులతో సమావేశమయ్యారు. రాయలసీమ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు పదేపదే చెబుతున్నా ఆశించిన పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. గతేడాదే ఒక టన్నెల్‌ పూర్తి చేసి ఉంటే గండికోటకు 25 టీఎంసీల వరకూ నీరిచ్చే అవకాశముండేదన్నారు. అనంతపురం జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయరు పూర్తిచేసి ఉంటే వర్షాభావ పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సాగునీరందించడం సాధ్యమయ్యేదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు