రాజ్‌ భవనా? 'రాజీ' భవనా?

రాజ్‌ భవనా? 'రాజీ' భవనా?

వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రాజ్‌ భవన్‌ పై విమర్శలు కురిపించారు. గవర్నరును టీడీపీ నేతలు ఫుల్లుగా వాడుకుంటున్నారని.. రాజ్‌ భవన్‌ కేంద్రంగా చంద్రబాబును కేసుల నుంచి రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. గవర్నర్‌ నరసింహన్‌ నివాసం రాజ్‌ భవన్‌ ను తెలుగుదేశం పార్టీ నేతలు రాజీ కుదుర్చుకునే భవన్‌ గా మారుస్తున్నారంటూ బొత్స తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  రాజ్‌ భవన్‌ లో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని గుర్తు చేసిన ఆయన... సుజనా చౌదరి, గవర్నర్‌ నరసింహన్‌ మధ్య ఈ విషయంపైనే చర్చలు జరిగాయని ఆరోపించారు. అయితే.. ప్రత్యేక హోదాపై చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారని ఆయన అన్నారు.  మా చెవిలో పూలు పెడితే మేమేమీ నమ్మబోమని ఆయన అన్నారు. ఏసీబీ డీజీపీ, తెలంగాణ సీఎంలు స్వయంగా వెళ్లి చంద్రబాబుపై విచారణకు సంబంధించిన వివరాలను నరసింహన్‌ కు వివరించారని, ఆ తరువాతే సుజనా చౌదరి గవర్నర్‌ ను కలిశారని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకునేందుకే సుజనా, గవర్నర్‌ ల మధ్య మాటలు నడిచాయని అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చలకయితే, కేంద్రంలో ప్రధానితో మాట్లాడాలని, హైదరాబాద్‌ లో గవర్నర్‌ తో చర్చలెందుకని బొత్స అడిగారు. హోదాపై తయారైన ముసాయిదా గురించి ముఖ్యమంత్రికి చెప్పకుండానే, గవర్నర్‌ కు చెప్పేందుకు సుజనా చౌదరి వెళతారని నమ్మబోమని అన్నారు. తన సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న ఘనత చంద్రబాబుదేనని బొత్స ఆరోపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English