పవన్‌ను పిసికేసిన జూపూడి

పవన్‌ను పిసికేసిన జూపూడి

సాధారణంగా పొగడ్త ఎలా ఉంటుంది? సందర్భోచితంగా, సదరు వ్యక్తికి నప్పే విధంగా ఉంటుంది. కానీ లేపి లేపి వదిలిపెట్టేలా సదరు కామెంట్లు ఉంటే ఏం అనిపిస్తుంది?ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనే సందేహం వస్తుంది కదా? ఇపుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరి అదే తరహా సందేహాలను రేకెత్తిస్తోందని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ పై టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి మరి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...పవన్‌ రాజకీయ నాయకుడు కాదట. కాపు నాయకుడు అంతకంటే కాదట. ఆయన ప్రజల హీరోనంట. పవన్‌ కళ్యాణ్‌ ఒక కాపు జాతికి మాత్రమే చెందిన వాడు కాదని ఆయన కులాలు, మతాలకు అతీతంగా సమాజంలో అణగారిన ప్రతి వర్గానికి అండగా నిలవాలనుకుంటున్న సంఘ సంస్కర్త, విప్లవ నాయకుడు అని జూపూడి ప్రశంసించారు. సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరోగా ప్రజలందరీ మన్ననలు అందుకుంటున్న నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ అని ఆకాశానికి ఎత్తేశారు. పవన్‌ కళ్యాణ్‌ను కాపు ఉద్యమంలో కలుపుకొనేది లేదని ఆ సామాజికవర్గం కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని తప్పుపట్టిన జూపూడి ఈ  రేంజ్‌లో కవిత్వం ప్రదర్శించారు.

పవన్‌ ఎప్పుడైనా మీతో కలుస్తానని చెప్పారా? అని ముద్రగడను జూపూడి ప్రశ్నించారు. కాపుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, కాపుల రిజర్వేషన్‌ తమ ఎన్నికల హామీ అని దీనిని శాస్త్రబద్ధంగా అమలు చేస్తామని ఒకవైపు చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నా మరొవైపు ముద్రగడతో పాటు పనిలేని మరి కొందరు నాయకులు బాబుపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని జూపూడి అన్నారు. కాపుల హక్కుల కోసం పోరాడితే తమకు అభ్యంతరం లేదని, అయితే, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న చంద్రబాబును నిద్రపోనివ్వమని, అంతుచూస్తామని బెదిరించడం సరికాదని చెప్పారు. గతంలో ఐదు సంవత్సరాల పాటు కేంద్రంలో మంత్రులుగా పనిచేసినా ఎన్నడూ కాపుల గురించి మాట్లాడని వ్యక్తులను నమ్ముతామంటున్న ముద్రగడ చంద్రబాబు, పవన్‌ కళ్యాణలపై ఆరోపణలు చేయడం అర్థరహితమని జూపూడి అభిప్రాయపడ్డారు.

చిరంజీవి పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడైనా కాపుల గురించి మాట్లాడారా? దాసరి నారాయణరావు తన సీటు గురించి అవసరం ఉన్నప్పుడు తప్ప కాపుల గురించి ఎన్నడైనా ప్రస్తావించారా? పల్లంరాజు కాపు అభివృద్ధిపై స్పందించారా? అని జూపూడి ప్రశ్నించారు. చిరంజీవి, దాసరి, పల్లంరాజు లాంటి వారిపై నమ్మకం కోల్పోయిన కాపులు గత ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌ వెంట నడిచారని జూపూడి గుర్తు చేశారు. అయితే, ముద్రగడ తన రాజకీయ లబ్దికోసం దాసరి, చిరంజీవితో పాటు వైఎస్సార్‌ నేతలతో కలిసి కాపులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దాసరి ఇంట్లో జరిగిన సమావేశాలు, ఆ తరువాత కాపు నేతల ప్రకటనలను ఆయన ఒక నాటకంగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు ఏపీ కోసం కంటి మీద కునుకు లేకుండా కృషి చేస్తున్నారని, అయితే, ముద్రగడ దాసరి చిరంజీవి లాంటి నాయకులు నిద్రపోతూ మెలుకువ వచ్చినప్పుడల్లా నోటికొచ్చింది నోటికొచ్చింది మాట్లాడుతుంటారని జూపూడి ధ్వజమెత్తారు. ముద్రగడ బృందాన్ని ఆయన ఊడగొట్టిన తహశీల్లార్ల సంఘమని ఎద్దేవా చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు