యాక్సిడెంట్ అయిన ‘బాలకృష్ణ’ కారు నడిపిందెవరు..?

యాక్సిడెంట్ అయిన ‘బాలకృష్ణ’ కారు నడిపిందెవరు..?

వివాదాలకు దూరంగా ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే ప్రముఖ సినీనటులు నందమూరి బాలకృష్ణ పేరు ఊహించని అంశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. మంగళవారం అర్థరాత్రి వేళ బంజారాహిల్స్ రోడ్డులో సినీ నటులు.. హిందూపురం బాలకృష్ణ పేరు.. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు యాక్సిడెంట్ కు గురైంది.  ఏపీ02 ఏవై 0001 రిజిస్ట్రేషన్ నెంబరు ఉన్న కారు దారుణ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఖరీదైన ఫార్చ్యూన్ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా చూసినప్పుడు ఆ కారు బాలకృష్ణ పేరు మీద ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ విషయం పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మంగళవారం అర్థరాత్రి వేళ.. మితిమీరిన వేగంతో వెళుతున్న కారు.. మూలమలుపు వద్ద అదుపు తప్పింది. అక్కడి చెట్టును ఢీ కొట్టి డివైడర్ ను బలంగా తాకింది. పెద్ద శబ్ధం చేస్తూ కారు ఢీ కొనటంతో ఆ ప్రాంతంలోని వారు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అదే రోడ్డులో దూరంగా ఉన్న కొందరు కాసేపటికి ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి చూడగా.. కారులో ఎవరూ లేరని.. కారు నడిపిన వ్యక్తి వెళ్లిపోయినట్లుగా తెలిసింది.

కారు ముందు భాగంగా బాలకృష్ణ పేరు.. ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉండటంతో ఈ కారు నందమూరి బాలకృష్ణదిగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. యాక్సిడెంట్ జరిగిన కాసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వారు ఎవరన్న అంశంపై దృష్టి పెట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరున్నారన్న అంశం మీద ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణకు అత్యంత సన్నిహితులే కారును నడిపి ఉంటారని చెబుతున్నారు. అర్థరాత్రి వేళ.. బాలకృష్ణ స్టిక్కర్ ఉన్న కారును అంత వేగంగా నడపగలిగిన చనువు సన్నిహితులకు మాత్రమే ఉండే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. దీనికి సంబంధించిన నిజానిజాలు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. డివైడర్ ను ఢీ కొట్టిన కారు ముందు భాగం నుజ్జు అయిన తీరును చూసిన వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎవరున్నారు? ఎవరు డ్రైవ్ చేస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు