రేవంత్‌ ఆరోపణల్లో లాజిక్‌ దొరికింది

రేవంత్‌ ఆరోపణల్లో లాజిక్‌ దొరికింది

పాములపర్తి జలాశయం నిల్వ సామర్థ్యం తొలుత 21 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం భావించి  7 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించడంపై టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డిపై ఘాటు కామెంట్లు కూడా చేసింది. పాములపర్తి జలాశయం నిల్వ సామర్థ్యం తొలుత 21 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం భావించింది నిజమేనని అంగీకరించింది. అయితే నీటి సరఫరా అవసరాలను తిరిగి మదింపు చేసినప్పుడు దాని సామర్ధ్యాన్ని తగ్గించుకున్నా నష్టం లేదన్న ఇంజినీర్ల సూచనలు, నివేదిక మేరకు 7 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించినట్లు  టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌  వెల్లడించారు. పనీ పాటా లేని టీడీపీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి  నీటి నిల్వ సామర్ధ్యంపై ఏ మాత్రం పసలేని, పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలలో మూడు లక్షల ఎకరాలకు పాములపర్తి ప్రాజెక్టు ద్వారా కాకుండా 50 టీఎంసీల సామర్థ్యమున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఇవ్వడమే అన్ని విధాల శ్రేయస్కరమని నిపుణులు నిర్ణయించారన్నారు. దాంతో పాములపర్తి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు తగ్గించారని వివరించారు.  రూ.2900 కోట్ల కొండపోచమ్మ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.700 కోట్లకు తగ్గిందని, భూసేకరణ 5420 ఎకరాల నుంచి 4320 ఎకరాలకు అంటే 1100 ఎకరాలకు తగ్గిందన్నారు. కావేరి సీడ్స్‌ సంస్థ భూములను కాపాడటానికే ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యాన్ని తగ్గించారన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలు పచ్చి అవాస్తవమని ఎంపీ అన్నారు. నిల్వ సామర్థ్యం తగ్గించిన తర్వాత కూడా కావేరి సీడ్స్‌కు చెందిన 200 ఎకరాలకు పైగా భూమి ముంపుకు గురువుతున్నదని వివరించారు. ఓ వైపు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి ముంపు నివారించాలని ధర్నాలు, దీక్షలు చేస్తూనే.. మరోవైపు పాములపర్తి ప్రాజెక్టును 21 టీఎంసీలుగానే ఉంచి వందల ఎకరాలను ముంచమని డిమాండ్‌ చేయడం రేవంత్‌రెడ్డి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేత రేవంత్‌రెడ్డి నిత్యం పత్రికల్లో, టీవీల్లో కనబడాలనే ఆరాటంతోనే రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులపై తప్పుడు కూతలు కూస్తున్నారని సుమన్‌ మండిపడ్డారు. బ్లాక్‌మెయిలింగ్‌కు రేవంత్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని ఆయన  విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు డీపీఆర్‌ లేదని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ చేసిన వ్యాఖ్యలపై సుమన్‌ మండిపడ్డారు. డీపీఆర్‌ లేకుండా ప్రాజెక్టులపై అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. డీపీఆర్‌ ఇచ్చిన తర్వాతనే మహారాష్ట్ర ఇంజినీర్లు సర్వే చేశారని తెలిపారు. అనంతరం మహారాష్ట్ర, తెలంగాణ ఇంజినీర్లు సంయుక్తంగా సర్వే జరిపి వ్యాప్కోస్‌ లైడార్‌ సర్వే నివేదికల ఆధారంగానే ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు