ప్రతిపక్షం బ్యాడ్‌ టైం ఈ రేంజ్‌లో ఉంది

ప్రతిపక్షం బ్యాడ్‌ టైం ఈ రేంజ్‌లో ఉంది

ప్రతిపక్షాలు అంటేనే అధికారపక్షంతో పోరాటం చేయడం సహజం.  ఈ క్రమంలో దూకుడుగా వెళుతుంటూ విపక్షంగా బలపడటం కూడా కామనే. కానీ కాంగ్రెస్‌ పార్టీలో సీన్‌ రివర్స్‌ అవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ప్రైవేటు మెంబర్‌ బిల్లుతో చర్చనీయాంశం చేసిన జోష్‌ మీదున్నప్పటికీ ఏపీ కాంగ్రెస్‌కు ఇంకా వలసల బాధలు తప్పడంలేదు. తాజాగా పీసీసీ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న దేవినేని నెహ్రూ సైకిల్‌ ఎక్కడంతో హస్తం నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయంతో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడితే సార్వత్రిక ఎన్నికల అనంతరం ఘోరఓటమితో ఉన్న సీనియర్లంతా ఆ పార్టీకి దూరమయ్యారు. తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ఇటీవల ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టి రాజకీయంగా పార్టీ ఉనికి తోడ్పడిన విషయం తెలిసిందే. అలా పార్టీ బలపడుతుందనుకుంటున్న క్రమంలో ఏపీ రాజధాని విజయవాడ కేంద్రంగా ఉన్న కీలక నాయకుడు దేవినేని పార్టీకి గుడ్‌బై చెప్పడం పార్టీ నేతలకు షాక్‌ తగిలినట్లయింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణం జాప్యం, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంతో ఎదగాలని భావిస్తుంటే...దేవినేని జంపింగ్‌ శరాఘాతమని చెప్తున్నారు.

పార్టీకి అవకాశమొచ్చి ఎదిగే సూచనలు కనిపిస్తున్న తరుణంలో పార్టీనుంచి ఇతర పార్టీలోకి కొనసాగుతున్న వలసలే తమను కుంగదీస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌నేతలు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని బతికించుకొనేదెలా అన్న సంసిగ్దతతో కాంగ్రెస్‌ నాయకత్వం పడింది. దక్షణాధి రాష్ట్రాలపై దృష్టిసారించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏపిలో పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. పార్టీ సీనియర్‌ నేతల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావించింది. కానీ తనకు పట్టుగొమ్మలుగా పార్టీ సీనియర్‌ నేతలు ఒక్కోక్కరుగా పార్టీని వీడటంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌లోనూ కలవరం మొదలైంది.త్వరలోనే కాంగ్రెస్‌ నేతలను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు