'మార్పుల'కు కండీషన్స్‌ అప్లై అంటున్న కోదండం

'మార్పుల'కు కండీషన్స్‌ అప్లై అంటున్న కోదండం

కాలం మారింది. కోదండం మాష్టారి గళంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ సర్కారు కొలువు తీరిన రెండున్నరేళ్ల వరకూ పల్లెత్తు మాట అనలేదు సరికదా.. ఎవరైనా విమర్శలు చేసినా.. సంయమనంతో వ్యవహరిస్తూ ఆచితూచి వ్యవహరించేవారు. వీలైనంత వరకూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ.. తెలంగాణ సర్కారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరించే వారు. సర్కారీ విషయాల్లోజోక్యం చేసుకోవటం లాంటివి సుతారం చేసే వారు కాదాయన. అలాంటి కోదండం మాష్టారు గడిచిన మూడు నెలలుగా కాస్త మారారు. గతంలోలా ఆయన వేచి ఉండే ధోరణికి స్వస్తి పలికి.. తప్పుల్ని తప్పులుగా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే.. ఎలాంటి మొహమాటం లేకుండా ఏకేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఎక్కడా తొందరపడి.. మాట తూలినట్లు కాకుండా ఆచితూచి వ్యవహరించటం కనిపిస్తుంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ మొదలుకొని కొత్త జిల్లాల ఏర్పాటు వరకూ కోదండం మాష్టారుపలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జోనల్‌ వ్యవస్థ రద్దుపైనా ప్రభుత్వంతో విభేదించారు. తాజాగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య చూస్తే.. తెలంగాణ సర్కారు నుంచి తానేం కోరుకుంటున్నానన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్లు కనిపిస్తుంది.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మార్పులు అవసరమే కానీ.. ఆ మార్పులు ప్రజాభిప్రాయానికి తగినట్లుగా ఉండాలన్న విషయాన్ని చెప్పేశారు. ప్రజలు కోరుకున్నట్లుగా మార్పులు జరగాలన్న తన అభిలాషను వ్యక్తం చేసిన కోదండం మాష్టారు.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. త్వరలో తాను అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లుగా చెప్పిన కోదండం మాష్టారి మాటలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణ సర్కారుపై తనకున్న అభిప్రాయబేధాల విషయంలో రాజీ లేని పోరాటాన్ని చేస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా కనిపిస్తోందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English