పవన్ను ఇరికించబోయి క్యామిడి అయిపోయిన వీర్రాజు

మిత్రపక్షమన్న కనీస మర్యాద కూడా ఇస్తున్నట్లు లేదు జనసేనకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. వీర్రాజు ఏమి మాట్లాడుతున్నా దానికి ముందు జనసేన నేతలతో చర్చిస్తున్నట్లు కనబడటం లేదు. తాజాగా వీర్రాజు చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. సీఎం అభ్యర్ధిపై గురువారం ఒకమాట మాట్లాడారు. తర్వాత ఏమైందో ఏమో శుక్రవారం ఉదయానికి మాట మార్చేశారు. గురువారం ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీసీ నేతే ఉంటారని ప్రకటించారు. అయితే రాత్రికి బాగా అక్షింతలు పడినట్లున్నాయి.

అందుకే శుక్రవారం ఉదయానికల్లా మాట మార్చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిని తాను డిసైడ్ చేయలేనని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షం అధినేత పవన్ కల్యాణ్ చేతిలో ఉందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీజేపీ తరపున బీసీ నేతే ఉంటారంటూ వీర్రాజు ఓ ప్రకటన చేశారు. సరే వీర్రాజు ప్రకటన ఎంత క్యామిడిగా ఉందన్నది వేరే విషయం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు దొరికితే అదే పదివేలన్నట్లుగా ఉంది కమలంపార్టీ పరిస్ధితి. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వచ్చేస్తున్నట్లు సీఎం పదవిని బీసీలకే కేటాయించేసినట్లు వీర్రాజు చెప్పటం క్యామిడి కాక మరేమిటి ?

బీజేపీ తరపున ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాట మాత్రమైనా చర్చించారా ? అన్నదే ఇక్కడ పాయింట్. కచ్చితంగా చర్చించలేదన్నది అర్ధమైపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా పవన్ను ప్రకటించాలని ఇఫ్పటికే జనసేన నేతలు బీజేపీ నేతలకు స్పష్టంగా చెప్పున్నారు. సీఎం అభ్యర్ధిగా బీజేపీ పవన్ను అంగీకరించి ప్రకటిస్తేనే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి పోటీ చేయటానికి అంగీకరిస్తామని కూడా స్పష్టంగా చెప్పారు.

వీళ్ళ ప్రతిపాదన, డిమాండ్ ఇలాగుండగానే వీర్రాజు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే 24 గంటలు కూడా తన నినాదాన్ని కంటిన్యు చేయలేకపోయారు. ఎందుకంటే ఇదే విషయమై రాత్రి వీర్రాజుపై అక్షింతలు పడినట్లుంది. అందుకనే తెల్లారేసరికి మాట మార్చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే విషయం తన చేతిలో ఏముందంటూ అమాయకంగా ప్రశ్నించారు. మరి ఈ విషయం గురువారం ప్రకటన చేసేముందు తెలీదా ? నోటికొచ్చింది మాట్లాడేయటం తర్వాత మాట మార్చటం వీర్రాజు బాగా అలవాటైపోయినట్లుంది. మొత్తానికి తాజా ప్రకటనతో వీర్రాజు క్యామిడి అయిపోయారనే చెప్పాలి.