ఇద్దరు స్వార్థపరుల స్నేహగీతం !

ఇద్దరు స్వార్థపరుల స్నేహగీతం !

కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అదీ చాలా అర్జెంట్ గా. మరి.. అమ్మకు సాయం చేసేందుకు ఆ మాత్రం హడావుడి తప్పదేమో. తన జీవితకాల కోరికను తీర్చిన సోనియకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పని కేసీఆర్.. ఈ రోజు కాంగ్రెస్ కోసం ఎందుకు అంత ఉరుకులు.. పరుగులు పెట్టారన్నది ఇప్పడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఊగిసలాడిన కేసీఆర్.. ఆ తర్వాత వచ్చిన ఓ ఫోన్ కాల్ తో ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని చాలా హడావుడి చేశారు. ఫోన్ కాల్ సారాంశం బయటకు తేలనప్పటికి.. సోనియమ్మతో స్నేహహస్తం అందించేందుకు తాను సదా సిద్ధమన్న విషయం మాత్రం ఢిల్లీ పర్యటన ద్వారా స్పష్టమైంది.

ఆహారబిల్లు సోమవారం చర్చకు రానుండటం.. ఓటింగ్ కు అవకాశం ఉన్న నేపథ్యంలో.. బొటాబొటీ బలం ఉన్న కాంగ్రెస్ కు కేసీఆర్ అండ్ కంపెనీ ఇచ్చే మూడు నాలుగు ఓట్లకు సైతం భారీ డిమాండ్ వచ్చింది. దీంతో అమ్మకు దగ్గరైన వాళ్ల నుంచి ఫోన్ రావటం.. రిక్వెస్ట్ చేయటంతో కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. స్నేహితుడికి సాయం చేసినందుకుగాను.. బయలుదేరి వెళ్లిన గులాబీ అధినేత కోరికల్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తీర్చటం ఖాయమనే చెప్పాలి. తెలంగాణ ప్రకటన చేసిన పక్షంలో తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రకటన అనంతరం పార్లమెంటు ఆమోదం పొందాక అని చెబుతూనే.. మరోవైపు విలీనంపై పునరాలోచనలో పడింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనంపై సందేహాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ టూర్ వెళతానని ప్రకటించిన కేసీఆర్ తర్వాత వాయిదా వేసుకున్నారు. కానీ.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో హుటాహుటిన బయలుదేరారు. తాజ ఢిల్లీ పర్యటన పార్లమెంటులో చర్చకొచ్చే ఆహారబిల్లుకు ఓటేసేందుకే అయినా.. ఈ సందర్భంగా విలీనంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ – టీఆర్ఎస్ స్నేహగీతంలో తాజా పర్యటన మొదటి అడుగు మాత్రమే. ఇకపై వారి బంధం మరింత బలోపేతం కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు