బాబులో కొత్త కోణం గమనించారా?

బాబులో కొత్త కోణం గమనించారా?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రూటు మార్చారు. సందర్భం ఏదైనా తన పంథా ఒక్కటేనని  బాబు చాటుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవ వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననీ ఇందులో  రాజీలేదని తేల్చిచెప్పారు. విభజన హామీలన్నీంటిని అమలు చేసి తీరాల్సిందేనన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానస్థాయికి వచ్చేవరకు కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వాల్సిందేని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, వెంకయ్యనాయుడు సమక్షంలోనే కేంద్రానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

పుష్కర ముగింపు వేడుకలను అద్భుత రీతిలో సంగమం ఘాట్‌ వద్ద  నిర్వహించారు.  కేంద్రమంత్రులతోపాటు ఒలింపిక్స్‌ రజిత పతక విజేత పీవీ సింధూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూచిపూడి నృత్య ప్రదర్శన, సింధూకు సన్మానం జరిపిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కృష్ణానది పవిత్రతను వివరిస్తూ పుష్కర ఆవిశ్యకతను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా కేంద్రంపై దృష్టి మళ్లించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి రాజీలేదని, పోరాటానికి కూడా తాము సిద్ధమేనని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసేందుకు తాము ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని పేర్కొంటూ ఇందుకు తగ్గ ఆర్థిక సహకారాన్ని కేంద్రం అందించాలని అన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు అత్యద్భుత నగరం అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ప్రపంచంలోని 10 అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందన్నారు. అన్నీంటికంటే సంకల్పబలమే గొప్పదని అది తనకు ఉందని చెప్పుకొచ్చారు. తన అధికారులు, క్యాబినెట్‌ సహచరులు, ప్రజలకు కూడా ఈ సంకల్ప బలం ఉందని వివరించారు.

గత ఏడాది గోదావరి పుష్కరాలు ముగింపు సందర్భంగా నదుల అనుసంధానాని చేసిన సంకల్పం ఏడాది తిరక్కముందే ఆచరణలో పెట్టి చూపించామని బాబు వివరించారు. ఇంత వరకూ నదులు అనుసంధానానికి సంబంధించి అనేక ప్రకటనలు వచ్చాయని పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారని పేర్కొంటూ తొలిసారిగా నదుల అనుసంధానాన్ని సాధించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదేని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషిచేస్తామంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే అన్ని విధాలుగా నష్టపోయిన ఈ విషయంలో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. పుష్కరాల వేదికగా కూడా ప్రత్యేక హోదా, కేంద్రం గురించి ప్రస్తావించడం అది కూడా సాక్షాత్తు కేంద్ర మంత్రుల సమక్షంలో చేయడం ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు