బాల‌య్య పీఏ వ‌సూళ్లు పీక్ స్టేజీకి చేరాయ‌ట‌

బాల‌య్య పీఏ వ‌సూళ్లు పీక్ స్టేజీకి చేరాయ‌ట‌

యువ‌ర‌త్న, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో విచ్చ‌ల‌విడిగా అవినీతి జ‌రుగుతోందా? స‌్వ‌యంగా బాల‌య్యబాబు స్థానిక పీఏ వీటికి అండ‌గా నిల‌వ‌డ‌మే కాకుండా అందులో భాగం పంచుకుంటున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సీపీఎం రాష్ట్ర నేత‌లు ఈ మేర‌కు ఏకంగా మీడియా ముఖంగా హైద‌రాబాద్‌లో వెల్ల‌డించారు.

సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌ద‌ర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అవినీతి, అక్రమాల కంపు కొడుతోందని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఎమ్మెల్యే, సినీన‌టుడు బాలకృష్ణ పీఏ ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. చివరికి మున్సిపల్ ఆఫీసుల్లో  కూడా వ‌సూళ్ల‌కు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. గతంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్, బాల‌య్య‌బాబు సోద‌రుడు హరికృష్ణ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గంలో ఇలాంటి దోపిడీలు నందమూరి వంశానికే సిగ్గుచేటని రామ‌కృష్ణ అన్నారు. ఇంత అవినీతి పాలన గతంలో ఎన్నడూ చూడలేదని మండిప‌డ్డారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో చూసే సమయం ముఖ్యమంత్రికి లేదని, దృతరాష్రునిలా పాలన సాగిస్తుడని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా వారి కుమారులు కూడా డబ్బు సంపాదనపై దృష్టి సారించారని పత్రికల్లో వార్తలొచ్చాయని రామ‌కృష్ణ‌ విమర్శించారు. ఇసుక, ఎక్సైజ్, తదితర కాంట్రాక్టులు తీసుకుని నిలువ దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.  సీఎం చంద్ర‌బాబు కేవ‌లం ప్ర‌చారంపై దృష్టి పెట్ట‌కుండా ప‌రిపాల‌న‌పై దృష్టి సారించ‌క‌పోతే ఏపీ ప‌రువు పోతుంద‌ని సూచించారు.