టీఆర్ఎస్ నేత‌ల‌కు రేవంత్ ఆహ్వానం

టీఆర్ఎస్ నేత‌ల‌కు రేవంత్ ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కొత్త పిలుపునిచ్చారు. కారణం ఏదైనా టీఆర్ఎస్‌పై భ్రమలతో ఆ పార్టీ లోకి వెళ్లిన టీడీపీ నేతలు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రండీ...అంటూ ఆయ‌న ఆహ్వానం ప‌లుకుతున్నారు. అంతేకాకుండా ఉద్య‌మ నాయ‌కులుగా ఉండి టీఆర్ఎస్‌లో ఎలాంటి గుర్తింపు లేని నాయ‌కులు సైకిల్ ఎక్కి ప్ర‌జా సమ‌స్య‌ల కోసం పోరాటం చేయాల‌ని రేవంత్ సూచించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్‌కు చెందిన పార్టీ మాజీ నాయ‌కుడు ప్రదీప్‌చౌదరి తన అనుచరులతో కలిసి పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్.రమణ, కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన సంద‌ర్భంగా ఈ కామెంట్లు చేశారు.

టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదన్న విషయం ఇప్పటికైనా గుర్తించి తిరిగి పార్టీలోకి రావాలని, ఆ విధంగా వచ్చే నేతలను పూర్వగౌరవంతోనే స్వాగతిస్తామని రేవంత్‌ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకమైన టీఆర్ఎస్‌ను వదిలి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే రెండేళ్ల కాలంలో ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకమై పేనిచేసే యువకులకే రాబోయే ఎన్నికలలో టీడీపీ ప్రాధాన్యతనిస్తుందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ పనిచేయకుండా తటస్థంగా ఉన్న యువనాయకులు కూడా తమ పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. భవిష్యత్తు టీడీపీదేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, వారికి కనీసం సీఎం అపాయింట్‌మెంట్ కూడా లభించడంలేదని చెప్పారు. కనీసం మాట్లాడి సమస్యలు చెప్పుకోడానికి కూడా అవకాశం లేకపోతే ఇక అభివృద్ధి చేయడానికి అస్కారం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. ఈ వాస్తవాన్ని గ్రహించే దారి తప్పిన తెలుగు తమ్ముళ్లు మళ్లీ టీడీపీలోకి రావడం ద్వారా తిరిగి జనజీవన ప్రవంతిలోకి వస్తున్నారని, వారందరినీ సాదరంగా స్వాగతిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ టీడీపీ పేదల కోసం పుట్టిందని, వారి సంక్షేమం కోసమే ఎన్టీఆర్ పార్టీని స్థాపించి చివ‌రి వరకు ప్రజాసంక్షేమానికే పాటుపడ్డారని చెప్పారు. ఆయన మార్గంలోనే ప్రస్తుతం చంద్రబాబునాయుడు కూడా పార్టీని ముందుకు నడుపుతున్నారన్నారు. కేసీఆర్ బెదిరింపుల కారణంగాను ఆయన ప్రలోభాల కారణంగా ప్రజలకు మేలు జరుగుతుందన్న భ్రమలతో టీడీపీని వదిలిపెట్టి టీఆర్ఎస్‌లోకి చేరిన ఎంతో మంది నాయకులు టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదన్న వాస్తవాన్ని గ్రహించి మళ్లీ సొంతగూటికి రావడానికి సిద్దంగా ఉన్నారని వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు