బలహీనత చాటుకున్న వైకాపా నిర్ణయం

బలహీనత చాటుకున్న వైకాపా నిర్ణయం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పులో కాలేసింది. తమ బలహీనతను తామే బహిరంగంగా చాటుకుంది. తెలంగాణ ప్రాంతంలో తమ ఉనికి నామమాత్రంగా కూడా లేదని, తమ విజయమ్మ చేస్తున్న దీక్ష తెలంగాణ సంక్షేమం కోసం ఉద్దేశించినది ఎంతమాత్రమూ కాదని వారు నిస్సిగ్గుగా ఒప్పుకున్నట్లు అయింది. తమ మీద అచ్చంగా సీమాంధ్రకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే ముద్ర బహిరంగంగా పడిపోకుండా ఉండడానికి వైకాపా నానా పాట్లు పడుతోంది.

రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన తర్వాత.. మూకుమ్మడిగా వైకాపా ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేశారు. విజయమ్మ, జగన్‌ కొంత ఆలస్యంగా చేశారు. వారు ఎలాంటి కబుర్లు చెప్పినాకూడా.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే డిమాండుకు కట్టుబడే వైకాపా మొత్తం రాజీనామాలు చేశారనే సంకేతం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లింది. దానికి తగ్గట్లుగానే ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంతపు నాయకులు 99 శాతం మంది రాజీనామాలు చేసి ఇతర పార్టీలవైపు మళ్లుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైకాపాకు తమకు తెలంగాణ అక్కర్లేదని, సీమాంధ్రలో పూర్తిస్థాయి పట్టు దక్కించుకుంటే చాలునని అభిప్రాయం ప్రబలింది.

ఈనేపథ్యంలోనే విజయమ్మ గుంటూరులో సమరదీక్ష ప్రారంభించారు. నేరుగా సమైక్యాంధ్ర కావాలనే డిమాండును వినిపించకుండా, అశ్వత్థామ హత: కుంజర: అనే సామెత చందంగా.. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే సరైన పద్ధతి అనే డిమాండ్‌తో ఆమె దీక్షకు పూనుకున్నారు. ఒకవేళ ఎన్నికల్లో విభజన జరగకపోతే గనుక.. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేయడానికి తమకు గల అవకాశాలు మూసుకుపోకుండా వైకాపా ఈ సమన్యాయం అనే పదాన్ని అతికించుకున్నదే తప్ప.. వారి మనసావాచాకర్మేణా సమైక్యాంధ్ర కోసమే పరితపిస్తున్నారన్నది నిజం. అయితే దాన్ని దాచుకోవవాలనే కుట్రకు తెగబడుతున్నారు.

అయితే శుక్రవారం అర్దరాత్రి దాటిన తర్వాత.. విజయమ్మ దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించడంతో.. వైకాపా బంద్‌కు పిలుపు ఇచ్చింది. భగ్నానికి నిరసనగా పార్టీ అధికారికంగా పిలుపు ఇచ్చినది రాష్ట్రవ్యాప్త బంద్‌కు కాదు, సీమాంధ్ర వ్యాప్త బంద్‌కు మాత్రమే. అంటే .. తమ డిమాండ్‌, దీక్ష అంతా కేవలం సీమాంధ్ర వారి ప్రయోజనాల్ని నెరవేర్చడానికి మాత్రమే.. అని వారు పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. అదే సమయంలో.. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీకి ఠికానా లేదని, బంద్‌కు పిలుపు ఇస్తే భంగపాటు తప్పదనే బలహీనతను కూడా వారు బయటపెట్టుకున్నట్లయింది. మాంసం తిన్నందుకు ఎముకలు మెడలో వేసుకుని తిరిగిన అజ్ఞాని లాగా.. సీమాంధ్రకు మాత్రమే బంద్‌ పిలుపు ఇవ్వడం ద్వారా తమ వైఖరిని, నైజాన్ని పార్టీ బహిరంగపరచుకున్నట్లు అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు