కేసీఆర్‌ చేసిన అవమానం జగన్‌ ఎప్పటికీ మర్చిపోలేరా?

కేసీఆర్‌ చేసిన అవమానం జగన్‌ ఎప్పటికీ మర్చిపోలేరా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిమ్మ తిరిగి పోయే షాక్‌ ఇచ్చారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. తెలంగాణరాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అఖిలపక్షాన్ని ఈ రోజు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అఖిలపక్ష నేతల జాబితాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేకపోవటం గమనార్హం.

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యేల్ని గెలుచుకుంది. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లిపోయారు. ఆఖరున ఎంపీ కమ్‌ తెలంగాణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం గులాబీ కారు ఎక్కేయటం.. ఆ సందర్భంగా పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించటం జరిగిపోయాయి.

ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఈ విషయాలపై జగన్‌ పెద్దగా స్పందించలేదు. తమ పార్టీకి చెందిన ఎంపీ.. ఎమ్మెల్యేల్ని అధికారపక్షంలోకి తీసుకోవటాన్ని ప్రశ్నించలేదు. విమర్శలు చేసింది కూడా లేదు. కేసీఆర్‌ విషయంలో మొదటి నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్న జగన్‌.. అందుకు తగ్గట్లే తన పార్టీని కలిపేసుకున్నా కామ్‌ గా ఉండిపోయారు. సొంత పార్టీ విషయంలో జరిగిన పరిణామాల మీదనే స్పందించని జగన్‌.. రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది లేదు. తనను ఏదశలోనూ వేలెత్తి చూపించని జగన్‌ ను కేసీఆర్‌ లైట్‌ తీసుకున్నారా? అన్న సందేహం కలిగేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆహ్వానించకపోవటం ఆసక్తికరంగా మారింది. సాంకేతికంగా చూస్తే.. తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అయితే.. ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందిన పార్టీలకు ఆహ్వానం పంపించాల్సి ఉండగా.. తమ పార్టీకి ఎందుకు పంపించలేదంటూ ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్‌ పార్టీ నేతలు ఒక ఆసక్తికరమైన వాదనను తెర మీదకు తెస్తున్నారు. తమ మాదిరే టీటీడీపీని కూడా తెలంగాణ అధికారపక్షంలో విలీనం అయినట్లుగా ప్రకటించిందని.. తమను పిలవని టీఆర్‌ఎస్‌ సర్కారు టీటీడీపీని మాత్రం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారని వాపోతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నది ఒకటి ఉందన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించటం లేదన్నది స్పష్టం. తెలుగు రాష్ట్రాల్లో తానొక తిరుగులేని రాజకీయ పక్షంగా భావించే వైఎస్‌ జగన్‌ లాంటి వారికి.. కేసీఆర్‌ సర్కారు వైఖరి ఆయన్ను ఎప్పటికి మర్చిపోలేని అవమానంగా మిగులుస్తుందనటంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు