కేంద్ర మంత్రి భార్యనే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారట..

కేంద్ర మంత్రి భార్యనే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారట..

ఆయనో కేంద్ర మంత్రి.. గతంలో సైన్యాధిపతిగానూ పనిచేశారు. అలాంటి వ్యక్తి భార్యనే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడట ఓ ప్రబుద్ధుడు. దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. తన మాటలను రికార్డు చేసిన వాటిని బయటపెడతానంటూ బెదిరిస్తున్నారన్నది ఆమె ఆరోపణ. అయితే.. మాటలకే బెదిరించే పరిస్థితి ఉందంటే ఆమె ఏం మాట్లాడారు..? ఎందుకంత భయపడుతున్నారు..? అధికార రహస్యాలేవైనా బయటపెట్టారా అన్న సందేహాలు పలువురి నుంచి వ్యక్తమవతున్నాయి.

కేంద్రమంత్రి వీకే సింగ్‌ భార్య భారతీ సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాటలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. రికార్డు చేసిన వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడని ఆమె చెబుతోంది. ఆగస్టు 6న తన కుటుంబానికి తెలిసిన ప్రదీప్‌ చౌహాన్‌తో తాను మాట్లాడానని... అయితే దాన్ని ఆయన రహస్యంగా రికార్డు చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని లేకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఢిల్లీ పోలీసులకు చెప్పారు. అయితే ప్రదీప్‌ చౌహాన్‌ వద్ద ఉన్న ఆడియో టేపుల్లో ఏముందో తనకు తెలియదని మాత్రం ఆమె చెబుతున్నారు.

భారతీ మాటలను సోషల్‌ మీడియాలో ఉంచి వాటి సహాయంతో కేంద్ర మంత్రి వీకే సింగ్‌ పరువు తీస్తానంటూ ప్రదీప్‌ బెదిరిస్తున్నాడని... 2 కోట్లు ఇస్తే ఆ టేపులు తిరిగి ఇస్తానని చెబుతున్నాడని ఆమె కంప్లయింట్‌ చేశారు. తాను మాట్లాడిన మాటలకు వేరే ఆడియోను జోడించి ఇలా బెదిరిస్తున్నారని.. తానేమీ వివాదాస్పద అంశాలు మాట్లాడలేదని ఆమె చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఆడియో టేపుల్లో ఏముందో తనకు తెలియదని ఆమె చెబుతున్నా ఏదో కీలకాంశాలపై నోరు జారి ఉంటారని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు