జగన్‌, చీప్ రజకీయాలు మానుకో

జగన్‌, చీప్ రజకీయాలు మానుకో

ఏపీ విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి చిత్రమైన సందేహాలు వస్తున్నాయి. రాష్ట్రం మొత్తంగా ఒక్క చోట ఒక సంఘటన జరిగితే.. దానిపై స్పందించే క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మోతాదు మించేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గోదావరి జిల్లాలో ఒకరిపై జరిగిన దాడిని ఉద్దేశించి జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలు భావోద్వేగాల్ని రగిలించేలా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో ఒక దళితుడిపై కొందరు దాడి చేయటం తెలిసిందే.

దీనిపై ఓపక్క విచారణ జరుగుతున్నప్పటికీ.. మరోవైపు జగన్‌ ఈ అంశాన్ని వీలైనంత ఎక్కువగా ఫోకస్‌ చేసి..  దళితుల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకచోట.. ఒక వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేస్తే.. అది దళిత సమాజం మొత్తం మీదా జరిగిన దాడిగా అభివర్ణిస్తున్న వైనం అభ్యంతరకరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమలాపురంలో జరిగిన ఘటనను ఖండించాల్సిందే. అదే సమయంలో.. ఆ ఘటనలో తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఆ పేరుతో రాజకీయం చేయాలనుకోవటం ఏ మాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి సమయం ఇచ్చి.. ఆ సమయంలోపు సదరు బాధితుడిపై దాడికి పాల్పడిన వారిని కనిపెట్టటం.. అదుపులోకి తీసుకోకపోవటం లాంటివి చేయని పక్షంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. సదరు బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందే. కానీ.. ఒక వ్యక్తిపై జరిగిన దాడిని ఒక వర్గంపై దాడిగా ఎలా చెబుతారన్నదే పెద్ద ప్రశ్న.

ఒక వ్యక్తిపై దాడి అంటే.. దాని వెనుక సవాలక్ష కారణాలు ఉండొచ్చు. కానీ.. సదరు వ్యక్తిపై జరిగిన దాడిని.. అంత వరకే పరిమితం చేయాలే తప్పించి.. అదో వర్గంపై జరిగిన దాడిగా అభివర్ణించటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. ఈ మధ్యనే ఇదే అంశం మీద అమలాపురం వెళ్లిన జగన్‌.. సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేవలం రోజు వ్యవధిలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌.. సమాజంలో ప్రస్తుతం జరిగిన ఘటనలు చూస్తే.. నిజంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందా? అన్న సందేహం కలుగుతుందని వ్యాఖ్యానించటం గమనారం.

ఇప్పటికీ స్వాతంత్య్రం లేని పరిస్థితి కనిపిస్తూ.. దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. జరిగిన ఒక దళితుడిపై జరిగిన దాడిని..'దళితుల'పై దాడిగా ఎలా వ్యాఖ్యానిస్తారన్నది ఒక ప్రశ్న. ఒక వ్యక్తిపై జరిగిన దాడిపై ఇంత తీవ్రంగా స్పందిస్తున్న జగన్‌.. ఐదు కోట్ల మంది ఆంధ్రులపై విభజన పేరిట జరిగిన దాడిపై మరెంతలా స్పందించాలి. విభజన కారణంగా చోటు చేసుకున్న నష్టాన్ని భర్తీ చేయాల్సిన కేంద్రం మౌనంగా ఉండటమే కాదు.. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల్ని ఇప్పటివరకూ అమలు చేయని వైనంపై మరెంతగా నిప్పులు చెరగాలి? ఒక వ్యక్తిపై దాడిపై తీవ్రపదజాలాన్ని వాడుతున్న జగన్‌.. కోట్లాది మందికి జరుగుతున్న నష్టంపై మరెంత తీవ్రస్థాయిలో విరుచుకుపడాలి? అన్నది ప్రశ్న. దీనికి జగన్‌ సమాధానం చెబితే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు