చంద్రబాబు.. జగన్‌ చేతులు ఎలా కలిసాయంటే

చంద్రబాబు.. జగన్‌ చేతులు ఎలా కలిసాయంటే

రాజకీయ విభేదాలు వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయి చాలాకాలమే అయ్యింది. రాజకీయాల్లో ఉత్తర.. దక్షిణ ధ్రువాలుగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నేతలు కలిసినప్పుడు మాత్రం ఒకింత సహృద్బావ వాతావరణం కనిపించేది. గతంలోకి చూస్తే.. ఒకరిపై ఒకరు విరుచుకుపడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. చంద్రబాబులు.. ఏదైనా కార్యక్రమంలో కలిసినప్పుడు ఒకరికొకరు షేక్‌ హ్యాండ్‌ లు ఇచ్చుకోవటం.. మాట్లాడుకోవటం ఉండేది. మొదట్లో ఇలాంటివి ఉన్నప్పటికీ.. తర్వాతి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలతో వైఎస్‌.. చంద్రబాబులు ముఖముఖాలు చూసుకునేందుకు సైతం ఇష్టపడని పరిస్థితి. ఒకేచోట కలిసినా.. ఎడమొఖం.. పెడమొఖం అన్నట్లుగా వ్యవహరించే వారే తప్పించి కనీసం చేతులు కలపటానికి కూడా ఇష్టపడే వారు కాదు.

నిజానికి వైఎస్‌.. చంద్రబాబుల మధ్య నడిచిన రాజకీయ వైరంతో పోలిస్తే.. చంద్రబాబు.. జగన్‌ ల మధ్య నడుస్తున్న వైరమే ఎక్కువ. తనకంటే వయసులో పెద్దవాడైన చంద్రబాబును ఏ మాత్రం గౌరవించని వైనం జగన్‌ లో కనిపిస్తుంది. అదే సమయంలో వయసులో చిన్నోడు కదా.. కాస్త ఆవేశం ఎక్కువ కదా సరిపెట్టుకుందామన్న భావన చంద్రబాబులో కనిపించదు. ఇద్దరి మధ్య మాటా.. మాటా ఎంత తీవ్రంగా సాగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును ఉద్దేశించి జగన్‌ ఎంత ఘాటుగా రియాక్ట్‌ అవుతారో టీవీల్లో అసెంబ్లీ కార్యక్రమాల్ని చూసే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ తాజాగా 'ఎట్‌ హోం' కార్యక్రమంలో కలిశారు. స్వాతంత్య్ర దినోత్సవం.. రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్‌ 'ఎట్‌ హోం' కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. దీనికి తొలిసారి హాజరైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలకు కొదవ లేదు. ఎట్‌ హోంకు హాజరైన జగన్‌ తిరిగి వెళుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరకు వెళ్లారు. దీంతో.. కేసీఆర్‌ లేచి జగన్‌ కు కరచాలనం చేశారు. అనంతరం తెలంగాణ మంత్రులు సైతం జగన్‌ కు వీడ్కోలు పలికేందుకు లేచి కరచాలనం చేశారు. ఇదిలా ఉంటే.. అక్కడే ఉన్న ఏపీ మండలి ఛైర్మన్‌ చక్రపాణి.. వైఎస్‌ జగన్‌ చేయి పట్టుకొని.. చంద్రబాబుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు.. నేను కలిపిస్తానురా అంటూ ఆయన్ను బాబు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు చేతిలో కాఫీ కప్పు ఉంది. దాన్ని పక్కన పెట్టి.. జగన్‌ కు అభివాదం చేశారు. తనకు వేరే కార్యక్రమం ఉందని జగన్‌ వెళ్లిపోయారు. నిజానికి ఈ కార్యక్రమం మొదట్లోనే.. చంద్రబాబు.. జగన్‌ లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. కానీ.. ఆ విషయం గుర్తించని చక్రపాణి.. మరోసారి ఇద్దరి చేతులు కలిపారు. ఈ దృశ్యం పలువురిని విశేషంగా ఆకర్షించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు