ఏపీలో మంట పుట్టిస్తున్న చిన్నమ్మ ఉచిత సలహా

ఏపీలో మంట పుట్టిస్తున్న చిన్నమ్మ ఉచిత సలహా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం అనే అంశం డిమాండ్‌ దశ నుంచి సెంటిమెంట్‌గా మారిన సమయంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందీశ్వరి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున్నే అసంతృప్తిని రాజేస్తున్నాయి. ఏపీకి చెందిన నాయకురాలిగా రాష్ట్రం కోసం మాట్లాడాల్సిన పురందీశ్వరి ఆ విషయం కంటే ఒకింత ఎకసెక్కంగా మాట్లాడారాని అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పర్యటించిన దగ్గుబాటు పురందీశ్వరి ఏపీకి ప్రత్యేక హోదా గురించి స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నందువల్ల హోదా కల్పించడం సాధ్యం కాదని పురందీశ్వరి  తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాయని, ఈ రాష్ట్రాలను ఒప్పిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్దమేనని తెలిపారు. ఈదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ చూపితే ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కే అవకాశం ఉందని పురందీశ్వరి అన్నారు.

ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ అసాధ్యమేనని, అయితే ప్రత్యేక హోదా కన్నా మెరుగైన సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పురందీశ్వరి తెలిపారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం కల్పించడానికి ప్రధాని అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. రాష్ట్భ్రావృద్ధికి దోహద పడటానికి కేంద్రం సిద్ధంగా ఉందని  ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యా వైద్యరంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సముచిత స్థానం కల్పించిందన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో కొందరు అవగాహన లేకుండా కేంద్రంపై విమర్శలు చేయడం దారుణమని పురందీశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నాబార్డు ద్వారా నాలుగు వేల కోట్లను కేటాయించిందని. ఈనిధులు పూర్తిగా కేంద్రమే భరిస్తుందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదన్నారు. హోదా విషయంలో అనేక సాంకేతిక సమస్యలు వున్న విషయాన్ని అందరూ గుర్తించి రాష్ట్భ్రావృద్ధికి ఏమి కావాలో అదిశగా ప్రయత్నిస్తే మంచిదని పురందీశ్వరి సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు