నయీంకు పెంచిపోషించింది ఎవరు?

నయీంకు పెంచిపోషించింది ఎవరు?

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని రాజకీయపార్టీల మధ్య వాదోపవాదాలకు వేదిక కాగా ఈ ఎపిసోడ్‌లోకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వైసీపీ తీసుకువచ్చింది. వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ నయీం ఈ స్థాయికి చేరేందుకు బాబే కారణమని అన్నారు.

నయీం చేసిన హత్యలు, భూకబ్జాలు, దోపిడీలు ఎంత నేరమో, నయీంను పెంచి పోషించడం అంతకంటే ఘోరమని పార్థసారథి వ్యాఖ్యానించారు. నయీం కేసును పారదర్శకంగా విచారణ జరిపి అతనితో సంబంధం ఉన్న లింకులన్నింటినీ పూర్తిగా చేధించి ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. అధికారం కోసం, కుర్చీ కోసం నేరస్తుల్ని... రాజకీయ, అధికార వ్యవస్థలు వాడుకుంటున్నాయో  దాన్ని తేటతెల్లం చేయాలని డిమాండ్‌ చేశారు. నయీం కేసులో ఏ వన్‌ గా తెలుగుదేశం మాజీ మంత్రి ఉన్నారని వార్తలు వచ్చాయంటే అపుడు సీఎంగా ఉన్న చంద్రబాబు బాధ్యతలు వహించాలని కోరారు. నయీం చేసిన ఘోరాలను, ఆయన్ను పెంచి పోషించిన వారి చిట్టాను కూడా విప్పాల్సిన అవసరం ఉంది. నయీం కేసును పరిశీలిస్తుంటే, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది నయీంలను పెంచి పోషిస్తారోననే భయాందోళనలు కలుగుతున్నాయన్నారు.

ప్రత్యేక హోదాపై టీడీపీ డ్రామాలాడుతుందోనని మండిపడ్డారు. ప్రత్యేకహోదా వద్దన్నదే టీడీపీ విధానంగా కనిపిస్తోందని ఆరోపించారు. హోదాపై చంద్రబాబు ఓ రకంగా మాట్లాడుతున్నారని, ఢిల్లీలో వాళ్ల ఎంపీలు మరో రకంగా నాటకమాడుతారని చెప్పారు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వైఎస్‌ జగన్‌ ఎక్కడ హోదాను సాధిస్తారన్న భయంతోనే ప్రత్యేక హోదానే తక్కువ చేసి లోకేశ్‌ మాట్లాడారని విమర్శించారు. ఏడాది క్రితం తండ్రి చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు లోకేశ్‌ వల్లె వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు