నయీం దెబ్బకు నేతలకు చెమటలు

నయీం దెబ్బకు నేతలకు చెమటలు

నయీం కేసు విచారణను ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో కళ్లు చెదిరే వాస్తవాలు బయల్పడుతున్నాయి. నయీంకు నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఆశ్రయమిచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఆమె నీడలోనే నయీం ఎదిగినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం.  ఆమె భర్త మాధవరెడ్డిని నక్సల్సు హతమార్చడంతో వారిపై కక్ష తీర్చుకోవడానికి నయీంను వాడుకున్నట్లు సిట్‌ సాక్షాలు సేకరించింది. ఒకట్రెండు రోజుల్లో ఆమెను ప్రశ్నించే అవకాశాలున్నాయి. సిట్‌ వద్ద ఉన్న ఆధారాలను బట్టి ఉమామాధవరెడ్డి అరెస్టు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

కాగా నయీంకు  పోలీసు శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, మాజీ మంత్రులు, పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులతో ఉన్న సంబంధాలు కూడా బహిర్గతమవుతున్నాయి.  దాదాపు వంద మంది పోలీసులు, సుమారు 50 మంది ప్రజాప్రతినిధులు, 70 మంది జర్నలిస్టులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.  నయీం డైరీల అధారంగా పలువురు ప్రముఖులపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నయీం గురించి ఎక్కడా ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. చాలామంది నేతలకు ఎక్కడో ఒక చోట వ్యవహారాలు నడిపిన ఘటనలున్నాయని చెబుతున్నారు.

నల్గొండ జిల్లాలోని అన్ని పార్టీల నేతలకు నయీంతో సంబంధాలు ఉండడంతో ఎవరూ ఆయన గురించి మాట్లాడకుండా గుంభనంగా ఉన్నారు. అయితే.. సిట్‌ విచారణలో చాలామంది పేర్లు బయటకు వస్తాయని తెలుస్తోంది. కేవలం తెలంగాణలోనే కాకుండా విజయవాడ, రాయలసీమ ప్రాంతంలోని నేతలకూ నయీంతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కారణంగానే ఏపీలోనూ నేతలంతా నయీం పేరు చెప్పగానే సైలెంటయిపోతున్నారట. ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందో తెలియని పరిస్థితుల్లో నయీంతో సంబంధాలున్న నేతలందరికీ చెమటలు పడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు