బాబూ.. చూచుకుందామా నీ పెతాపమో నా పెతాపమో?

బాబూ.. చూచుకుందామా నీ పెతాపమో నా పెతాపమో?

ఆమరణ దీక్షలతో ప్రసిద్ధి చెందిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఆమరణ దీక్షకు రెడీ అంటున్నారు. అయితే.. ఈసారి తన ప్రాధాన్యాన్ని మార్చుకున్నారు. కాపు ఉద్యమం అంటే చంద్రబాబు తొక్కేస్తారనుకున్నారో ఏమో కానీ ఈసారి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తానంటున్నారు. అయితే.. ఈ పోరాటం తాను ప్రారంభించబోనని.. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ కేంద్రంతో పోరాడాలని సూచించారు. అంతేకాదు... ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, లోకేశ్ లు ఆమరణ దీక్ష చేయగలరా అని సవాల్ విసిరారు.. వారు కనుక ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తే తాను కూడా వారితో కలిసి ఆమరణ దీక్ష చేస్తానని చెప్పారు.

ఈ మేరకు ఆయన చంద్రబాబునుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. ఈ సవాల్ స్వీకరించడం ద్వారా చంద్రబాబు రెండు విషయాలపై ఉన్న అనుమానాలు తొలగించిన వారవుతారని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై చంద్రబాబు చిత్తశుద్ధి ఎంత ఉందో తెలియడం మొదటి విషయం అయితే... తామిద్దర్లో ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరో నిరూపించడం ద్వారా పటుత్వం, పట్టుదల, లక్ష్య సాధనలో సామర్థ్యం కూడా తెలిసిపోతుందని ఆయన అన్నారు.

కాపు రిజర్వేషన్ కోసం తాను చేపట్టిన దీక్షపై తన అనుచరులతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని ఆయన ఆరోపించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఆర్థికంగా, సామాజికంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాపు జాతి శ్రేయస్సు కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. అయితే.. కాపుల ప్రయోజనాల కోసం ముందుకొచ్చి పోరాడిన ముద్రగడ ఇప్పుడు అంతకంటే విస్తృత స్థాయిలో రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనం కలిగించే అంశం అయిన ప్రత్యేక హోదాపై మాత్రం చొరవ చూపడం లేదు. చంద్రబాబు, లోకేశ్ లను ఎగదోస్తున్నట్లుగానే ఉంది తప్ప తాను స్వయంగా ఏ కార్యక్రమం చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English