మోడీని కేసీఆర్ బోల్తా కొట్టించారా?

మోడీని కేసీఆర్ బోల్తా కొట్టించారా?

రెండు రోజుల్లో ప్రధాని మోడీ తెలంగాణకు రానున్న తరుణంలో విపక్షాల విమర్శల వేడి పెరిగింది. ఇప్పటికే టీఆరెస్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కాంగ్రెస్ నేతలు తాజాగా సరికొత్త విమర్శలకు తెరతీశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలంలో ప్రవేశపెట్టిన పథకాలకు ఇప్పటి సీఎం కేసీఆర్ పేర్లు మార్చి తనవిగా ప్రకటించుకుంటుంటే ప్రధాని మోడీ కూడా ఏమీ తెలియకుండా వాటిని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.   ప్ర‌ధాని ఆగ‌స్టు 7న తెలంగాణ‌లో పర్యటించి పలు పథకాలను ప్రారంభించనున్నారు.. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేపథ్యంలో టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బీజేపీ టీఆర్ ఎస్ పార్టీల‌కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. అంతేకాదు.. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాక ప్రారంభోత్సవాలు చేసుకోవాలని.. లేదంటే ఆ పథకాలు కాంగ్రెస్ వేనని అంగీకరించినట్లేనని అంటున్నారు.

 సీఎం వైఎస్ చేప‌ట్టిన‌ జ‌ల‌య‌జ్ఞం ప‌నుల‌కే కేసీఆర్ మిష‌న్ భ‌గీర‌థ అని పేరు మార్చారని.. ప్రాణ‌హిత – చేవెళ్ల 2008లో తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే  ప్రారంభించామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా 30 టీఎంసీల‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించేందుకు మౌలానా సుజ‌ల స్ర‌వంతి పేరుతో ఎల్లంప‌ల్లి, మానేరుల ప్రాజెక్టుల‌ నుంచి రాజ‌ధానికి గోదావ‌రి నీటిని త‌ర‌లించే ప్రాజెక్టును నిర్మించింది తామేన‌న్నారు. ఇది గ‌తేడాది పూర్త‌యితే దాని పేరు మార్చేసి  మిష‌న్ భ‌గీర‌థ‌ ఖాతాలో వేసేశారని ఆరోపించారు.  దేవాదుల‌, ఎల్లంప‌ల్లి ప్రాజెక్టులు కూడా అప్పట్లో వైఎస్ జ‌ల‌య‌జ్ఞంలో భాగంగా చేప‌ట్టిన‌వేనని తెలిపారు.

ఇప్పుడు కేసీఆర్ తమవిగా గొప్పగా చెప్పుకొంటున్న ప్రాజెక్టుల కోసం అప్పటి వైఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింద‌ని.. తమ హయాంలోనే భూసేక‌ర‌ణ‌, నిర్వాసితుల పున‌రావాసం, ప్రాజెక్టు వ్యయానికి అవసరమైన బ్యాంకు రుణాల ప్రక్రియ అంతా పూర్తయిందని చెబుతున్నారు. తాము పూర్తి చేసిన ప‌థ‌కాల‌ను ప్ర‌ధాని మోడీ వ‌చ్చి ప్రారంభోత్స‌వం చేయ‌డమేంట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇవన్నీ మోడీకి తెలియక కేసీఆర్ మాటలు విని ప్రారంభోత్సవాలకు వస్తున్నారని.. కనీసం తెలంగాణ బీజేపీ నేతలైనా మోడీకి అసలు విషయం చెప్పాలన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు