రఘువీరా చీపురు పట్టుకొని ఊడ్చేలా చేస్తారా?

రఘువీరా చీపురు పట్టుకొని ఊడ్చేలా చేస్తారా?

తాము చేసిన తప్పులకు చెంపదెబ్బలు వేసుకోవటం తర్వాత.. కనీసం క్షమాపణలు కూడా చెప్పని వైనం ఏపీ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది. ఎప్పటికి చెరిగిపోని తప్పును చేయటమే కాదు.. ఈ రోజు ఏపీకి ఎదురయ్యే సర్వ దరిద్రాలకు కారణంగా తామేనన్న విషయాన్ని వీలైనంత త్వరగా మర్చిపోవాలని భావిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. అందుకే.. నిన్నమొన్నటివరకూ అవకాశం కోసం చూసిన వారు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం తెర మీదకు రాగానే చెలరేగిపోతున్నారు. ఏపీ అధికారపక్షం ఏమీ చేయటం లేదని మండిపడుతున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా.. ఇదంతా విభజన పాపమన్న విషయాన్ని మాత్రం అస్సలు ప్రస్తావించరు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాలని.. మోడీని కలవాలంటూ సవాలచ్చ ఐడియాలు ఇచ్చే ఆయన.. తమ అధినేత్రి సోనియాగాంధీ కానీ.. తన స్వరాన్ని పెంచి.. మోడీ పరివారం షాక్ తినేలా ఏపీ ప్రత్యేక హోదా గురించి లోక్ సభలో గళం విప్పి సభను స్తంభించేలా చేస్తే పరిస్థితుల్లో మార్పులు రావా? కానీ.. అలాంటిదేమీ చేయని ఆయన.. ఈ నెల ఐదున రాజ్యసభలో ఓటింగ్ జరిగేలా చేయాలని.. అందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా వచ్చేలా చేస్తే కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు.. సుజనా చౌదరి.. వెంకయ్యనాయుడు ఇంటి ముందు చీపురు పట్టుకొని ఊడుస్తానంటూ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరగకపోతే.. టీడీపీ.. బీజేపీ నేతల్ని ఏపీ ప్రజలు తరిమి కొడతారంటూ చెబుతున్న ఆయన.. గతాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తున్నారు. విభజన కానీ జరగకపోతే సోనియాగాంధీ ఫోటోల్ని ఇళ్లల్లో పెట్టుకొని పూజిస్తామని సమైక్యవాదులు చెప్పిన విషయాన్ని రఘువీరా మర్చిపోయినట్లున్నారు. హోదా ఓటింగ్ చంద్రబాబు పరిధిలో ఉండదన్న విషయం తెలిసి సైతం రఘువీరా చేసే వ్యాఖ్యలు చూస్తే కాస్త సిత్రంగా ఉన్నాయని చెప్పాలి. ఢిల్లీకి వెళ్లినా మొండి మోడీ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్న ఉద్దేశంతోనే ఏపీని వదిలి వెళ్లటానికి బాబు ఇష్టపడటం లేదన్న విషయం తెలిసి మరీ.. ఏపీ ముఖ్యమంత్రిని ఢిల్లీకి వెళ్లాలని రఘువీరా చెప్పటం కనిపిస్తుంది. సాధ్యంకాని పనుల్ని తెర మీదకు తీసుకొస్తేనే కదా రాజకీయ లబ్థి కలిగేది. అలాంటి విషయాల్లో ఆరితేరిన రఘువీరా లాంటోళ్లు ఇలాంటి మాటలే తప్పించి.. హోదా మీద తమ అధినేత్రిని కానీ.. యువరాజును కానీ కదిలించి.. వారి చేత దీక్ష గట్రా లాంటివి చేయిస్తే మరింత ఎఫెక్ట్ ఉంటుంది కదా? చేతిలో ఉన్నది వదిలేసి.. బాబు మీద పడతావేంటి రఘువీరా..?​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు