వెంక‌య్య లీకు నిజ‌మైతుందా?

వెంక‌య్య లీకు నిజ‌మైతుందా?

ప్రత్యేక హోదా డిమాండ్  పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేసిన కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ర‌కంగా న్యాయం చేసేందుకు సిద్ధ‌మైంద‌ట‌.   కేంద్ర సమాచార మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఈ తాజా స‌మాచారం అందిస్తున్నారు. అదికూడ తాను సాక్షాత్తుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ద్వారా తెలుసుకున్నాన‌ని ఆయ‌న సెల‌విస్తున్నారు.

పార్లమెంట్ స‌మావేశాల‌ సంద‌ర్భంగా లోక్‌స‌భ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో తలెత్తిన పరిణామాలను వివరించారని వెంక‌య్య నాయుడు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరసనలు, గత రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు మీడియా వద్ద వ్యక్తం చేసిన అసంతృప్తి, ఆగ్రహం తదితర అంశాలను మోదీకి వివరించారట‌. విభజన చట్టం హామీల అమలుపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం పట్ల తెదేపాలో తీవ్ర అసంతృప్తి రగిలిన విషయాన్ని ప్రస్తావించారట‌. తెదేపా, వైకాపాలు పార్లమెంట్ లోపలా బయటా చేసిన ధర్నా అంశాన్నీ వెంకయ్య ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఆయ‌న వివ‌రించిన ప్ర‌కారం...ఏపీకి ఏదో ఒకటి వెంటనే చేయాలన్న వెంకయ్య సూచనతో ఏకీభవించిన ప్రధాని మోదీ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించినట్టు చెబుతున్నారు. ''ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం గురించి ఒక నిర్ణయం తీసుకునేందుకు అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, వెంకయ్యతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమైందా? ఏపీ సిఎం చంద్రబాబుతో చర్చలు జరిపిందా?'' అని మోదీ వెంకయ్యను ప్రశ్నించారు. ఇంతవరకు కమిటీ భేటీ కాలేదని వెంకయ్య వివరించారు.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటంపై నీతి ఆయోగ్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధంచేసి ఆర్థిక శాఖకు పంపిందని, ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉన్నాయని వెంకయ్య ప్రధానికి వివరించినట్టు తెలిసింది. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశంపై వెంటనే అరుణ్ జైట్లీతో సమావేశమై తదపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోదీ ఆదేశం మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వెంకయ్యనాయుడు, తెదేపా ఎంపీ సుజనాచౌదరి పార్లమెంటు ఆవరణలోని ఆయన కార్యాలయంలోనే రెండుసార్లు సమావేశమై సమాలోచనలు జరిపారు. ఏపీకి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనేది నిర్ణయించేందుకు తనకు మరింత సమయం కావాలని జైట్లీ సూచించటంతో సమావేశం ఎలాంటి ఆలోచనకూ రాకుండానే ముగిసింది. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టతకు వచ్చిన తరువాత, బిజెపి నేతలు చంద్రబాబుతో సమావేశమవుతారనే మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు