లేడీ ఎంపీ.. రాజ్యసభలో కన్నీరు!

లేడీ ఎంపీ.. రాజ్యసభలో కన్నీరు!

ఆమె అమ్మ విధేయురాలు. ఆమె విధేయతకు మెచ్చి అమ్మ 'రాజ్యసభ' సభ్యత్వాన్ని ఇచ్చింది. ఇప్పుడు అమ్మకు కోపం వచ్చింది. సహజంగా ఇలాంటి జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మాట మాట్లాడకుండా అమ్మ ఏం చెబితే అది చేసేస్తారు. కానీ.. అలా జరిగితే అసలు వార్త అయ్యేది కాదు. అమ్మకే షాకిస్తూ.. ఆమె మీదనే ఫిర్యాదు చేసి పంరాయితీ పెట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అమ్మ ఎవరో ఇప్పటికే అర్థమై ఉండి ఉంటుంది. అవును.. అన్నాడీఎంకే అధినేత్రి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి చెబుతున్నది.

అమ్మ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప వ్యవహారం వార్తల్లోకి రావటం తెలిసిందే. తమ రాష్ట్రానికే చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యులు తిరుచ్చి శివను.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చెంక ఛెళ్లుమనిపించిన ఉదంతంపై అమ్మ అగ్గి ఫైర్ అయ్యింది.  పార్టీ పరువు తీస్తున్నారని సీరియస్ అయి.. పదవికి రాజీనామా చేయాలని ఫర్మానా జారీ చేశారు. మిగిలిన వారి మాదిరి కాకుండా శశికళ అమ్మకే షాక్ ఇచ్చారు.

అమ్మ మాట వినని ఆమె నేరుగా రాజ్యసభలో తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలన్న ఆమె.. తనను పదవి నుంచి రాజీనామా చేయమంటున్నారంటూ బోరున విలపించారు. దీంతో.. వాతావరణ ఒక్కసారిగా మారింది. సభలోని సభ్యులందరికి రక్షణ కల్పిస్తామంటూ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఆమెకు అభయమిచ్చారు.

ఎయిర్ పోర్ట్ లోజరిగిన చిన్న గొడవను పెద్దది చేసి.. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. సోషల్ మీడియాలో తన పరువు తీసేలా వ్యవహరించారని వాపోయిన ఆమె.. మహిళా ఎంపీ అయిన తనను ఇలా వేధిస్తున్నారన్న ఆమె.. తనకిక రక్షణ ఎక్కడంటూ ప్రశ్నించారు. ఒక నేత తన చెంప మీద కొట్టారంటూ ఆరోపించిన ఆమె.. తనను ఎవరు కొట్టారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాను తన పదవికి రాజీనామా చేసేది లేదని శశికళ తేల్చి చెప్పటం గమనార్హం. ఏది ఏమైనా.. అమ్మ చెప్పిన తర్వాత కూడా పదవికి రాజీనామా చేయని శశికళ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ఇలాంటి అనుభవం ఎదురుకాని జయలలిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు