రాజధాని వచ్చిన ఆనందంలో తాగేస్తున్నారు

రాజధాని వచ్చిన ఆనందంలో తాగేస్తున్నారు

నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసిన తరువాత ఇక అక్కడ అభివృద్ధి మామూలుగా ఉండదని అంతా భావించారు. రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లా.. రాజధానికి రెండో వైపు ఉన్న కృష్ణా జిల్లాలు మరింత అభివృద్ధి చెందుతాయని అంతా కలలు కన్నారు. జనం కోరుకున్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వంటి అభివృద్ధి ఇంకా రాకపోయినా ప్రస్తుతానికి రియల్‌ ఎస్టేట్‌ మాత్రం బాగానే అభివృద్ధి చెందింది. మద్యం వ్యాపారం కూడా బాగా జోరందుకుందట.. అది కూడా మామూలుగా కాదు, దాదాపు పది రెట్లు వృద్ధి నమోదైందంటే రాజధాని జిల్లాల ప్రజలు మామూలుగా తాగడం లేదని అర్థమవుతోంది.

గుంటూరు, కృష్ణాలలో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి. గత ఐదేళ్ల రికార్డులను పరిశీలిస్తే గడిచిన రెండేళ్లుగా ఈ రెండు జిల్లాల్లో లిక్కర్‌ వినియోగం భారీగా ఉంది. గత రెండేళ్లుగా అంటే రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ రాజధానిని ప్రకటించిన తరువాతనే స్పష్టంగా అర్థమవుతోంది. 2013-14 లో మద్యం వినియోగంలో కృష్ణాజిల్లాలో వృద్ధిరేటు కేవలం ఒకశాతం ఉండేది. 2014-15తో వృద్ధి రేటు 0.84గా నమోదైంది. అయితే 2015-16లో మాత్రం లిక్కర్‌ వినియోగంలో ఏకంగా 10.02 శాతం వృద్ధిరేటును కృష్ణా జిల్లా నమోదైంది. అంటే.. రాజధాని వ్యవహారాలు ఒక కొలిక్కి రావడంతో పాటు విజయవాడ కేంద్రంగా పాలన మొదలైన తరువాతన్న మాట. విజయవాడ కేంద్రంగా పాలన మొదలైన తరువాత అక్కడ అద్దెలు కూడా అమాంతం పెరిగాయి. భోజనం, టిఫిన్లు, లాడ్జిలు ఇలా ప్రతి ధరా పెరిగిపోయింది. ప్రజల ఆదాయం పెరగడం... వ్యాపారాలు, వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలు పెరగడంతో మద్యం వ్యాపారమూ బాగా పెరిగిందని అర్థమవుతోంది.

గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో 2014-15లో మద్యం విక్రయాల వృద్ధిరేటు 3.85గా ఉంది. 2015-16కు వచ్చే సరికి వృద్ధిరేటు 12. 35శాతానికి పెరిగింది. సాధారణంగా మద్యం విక్రయాలు ఎక్కువగా ఉండే జిల్లాలను కూడా రెండేళ్లలో గుంటూరు,కృష్ణా క్రాస్‌ చేసేశాయి. రాజధాని ప్రకటన తర్వాత ఈ రెండు జిల్లాల్లో డబ్బు చెలామణి ఎక్కువవడం కూడా మద్యం విక్రయాలు పెరిగేందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు