అంత పెద్దమనిషి దండం పెట్టాల్సిన అవసరమేమిటి?

అంత పెద్దమనిషి దండం పెట్టాల్సిన అవసరమేమిటి?

తెలుగోడికి ఎన్టీవోడు ఆత్మగౌరవమన్న ఐడెంటిటీ తీసుకొస్తే.. చంద్రబాబు మరోరకమైన గుర్తింపును తీసుకొచ్చారు. వాస్తవానికి ఎన్టీఆర్ తెచ్చిన ఇమేజ్ నోట్లోకి నాలుగు ముద్దలు పోవు కానీ.. వ్యక్తిగతమైన గౌరవానికి మాత్రం ఢోకా ఉండదు. కానీ.. చంద్రబాబు తెలుగువాడికి తెచ్చిన గుర్తింపు అందుకు పూర్తి భిన్నమైంది. మరింత విలువైంది కూడా. మీరు ఆత్మగౌరవంతో బతుకుతాను అని ఎవరికైనా చెప్పారనుకోండి. మీరు ఉన్నత స్థాయిలో ఉండే గౌరవిస్తారు.. గొప్పగా చెప్పుకుంటారు. అదే.. జీవితంలో పెద్దగా సక్సెస్ కాలేక.. మామూలుగా ఉన్నారనుకోండి.. మీ ఆత్మగౌరవ నినాదమే మీ పాలిట శాపమవుతుంది. అది ఆత్మగౌరవం కంటే కూడా.. పొగరుగానే ఎదుటివ్యక్తి మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఎవరికి వారు.. వారి దృష్టికోణంలో నుంచి చూస్తారే తప్ప.. అవతలవాడి ఆలోచనలకు తగ్గట్లు చూడరు. ఇక్కడ ఎన్టీఆర్ వ్యవహారం కూడా అంతే. తెలుగువాడికి ఎలాంటి ప్రత్యేకత లేదన్నప్పుడు.. అరే..భయ్.. తినటానికి తిండి లేకపోవచ్చు.. కానీ ఆత్మగౌరవం ఉంది.. పౌరుషం ఉందని గర్జించారు. ఆ రోజులకు ఆ మెలోడ్రామా సరిపోయింది. కానీ.. కాలం మారిపోయింది. ప్రపంచం తీరు తెన్నులు మారిపోయింది.

ఎవరైనా సరే.. వాడి గొప్పతనాన్ని.. వారి మేధావితనం కానీ.. వాడు ఆర్థికంగా, సామాజికంగా ఎంత వృద్ధిలో చెందాడన్న దానిపైనే తప్ప.. మిగిలిన విషయాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవటం లేదు. అది వ్యక్తి అనే స్థాయి నుంచి దేశం అనే స్థాయి వరకు. ఒకదేశం తురుంఖాన్ అంటే.. దానికున్న ఆర్థికబలమే తప్ప మరోటి కాదు. ఇలాంటి విషయాల్ని గుర్తించిన తొలితరం రాజకీయ నేతగా చంద్రబాబును చెప్పొచ్చు. మాటలు ఎన్ని చెప్పినా చివరాఖరకు.. మనం ఏం చేయగలిగాం అన్నదే చూస్తారు కాబట్టి.. అప్పటి ప్రపంచానికి అవసరమైన ఐటీ పరిశ్రమ వృద్ధిని గుర్తించి.. దానిపై మన పిల్లలు దృష్టి పెట్టేలా చేశాడు. ప్రపంచం అంతా కంప్యూటర్ గురించి మాట్లాడుకునే వేళ.. కంప్యూటర్ తో తెలుగోడు అది చేస్తాడు.. ఇది చేస్తాడు.. ఏమైనా చేస్తాడన్న స్థాయికి తీసుకెళ్లి.. ఐటీ ప్రపంచంలో తెలుగువాడికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ఒకవ్యక్తి బంధువుల ఇళ్ల మొత్తంలో ఎక్కడో దూరం చుట్టం ఒకరు అమెరికాలో ఉన్నాడు అనే స్థాయి నుంచి వీధిలొ ఐదారుగురు అమెరికాలో ఉండే స్థాయికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే.

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయటానికి.. ఇప్పుడున్న షేప్ కి తీసుకురావటానికి 400ఏళ్ల కంటే ఎక్కువే పడితే.. సైబరాబాద్ అనే నగరాన్ని కేవలం పదేళ్ల కాలంలో వృద్ధి చేయటమే కాదు.. అక్కడికి వెళితే.. మనం హైదరాబాద్ లోనే ఉన్నామా అన్నట్లు చేసిన ఘనత కచ్ఛితంగా చంద్రబాబుదే. హైదరాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన వ్యక్తిని హైదరాబాద్, సికింద్రాబాద్ లోని రకరకాల ప్లేసులకు కార్లో తిప్పి.. మధ్యాహ్నం భోజనం పెట్టించి.. కార్లో కాసేపు కునుకు తీయమని చెప్పి.. మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ (అదేనండి సైబరాబాద్) లోపలికి కారు వెళ్లాక అతన్ని నిద్ర లేపి చూపించండి.. చంద్రబాబు గొప్పతనమేమిటో ఇట్టే అర్థమవుతుంది. అసలు మనం ఉంది.. హైదరాబాద్ లోనేనా? అనే సందేహం కలగకమానదు. చార్మినార్ ఇరుకు గల్లీలో నడుస్తున్నప్పుడు మనం ఉంది.. హైదరాబాద్ లోనేనా అన్న సందేహం ఎలా అయితే కలుగుతుందో.. సరిగ్గా అలాంటి పీలింగే.. సైబరాబాద్ రోడ్ల మీద వెళుతున్నప్పుడు కచ్ఛితంగా కలుగుతుంది.

అలా తీర్చిదిద్దిన సిటీని.. ఈ రోజు భావోద్వేగాలు రెచ్చగొట్టుకొని ఒకరిని ఒకరు ద్వేషించుకొని.. ధూషించుకుంటే కానీ నిద్రపోని పరిస్థితికి వెళ్లిపోయాం. ఒక సిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నేతకు.. ఇలాంటి పరిణామాలు బాధ కలిగించేవే. ఆవేదన రగిలించేవే. వీటికి తోడు ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అధికారంలోకి రాకూడదన్న ఒకేఒక్క ఆలోచనతో.. వేస్తున్న కుయుక్తులను చూసినప్పుడు చంద్రబాబు లాంటి దార్మినికుడు (ఈ మాట చాలామంది కమ్యూనిస్ట్ అండ్ కో అస్సలు ఒప్పుకోరు. కానీ సైబరాబాద్ వీధుల్లో నడిచే ఎవర్ని అడిగినా అందుకు భిన్నమైన సమాధానం దొరుకుతుంది) బాధ పడటంలో అర్థముంది. అందుకే ఆయన వేదన నిండిన మనసుతో... ‘‘దండం పెట్టి చెబుతున్నా.. దయచేసి విద్వేషాలు పెంచకండి’’ అని తెలుగువాళ్లని బతిమిలాడుతున్నారు. బాబు పెట్టిన అభివృద్ధి ఫలాలు తిని వచ్చిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న తెలుగువాళ్లు.. ఒక్క క్షణం ఆలోచించాలేమో... చంద్రబాబు అనే వ్యక్తి లేకపోతే ఈ హైదరాబాద్ ఎలా ఉండేదోనని. అందుకే.. ఈ సిటీ వరకు ఏమైనా మాట్లాడే హక్కు ఉందంటే.. ప్రాంతాలకు.. రాజకీయాలకు అతీతంగా.. ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఇది కాదనలేని సత్యం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English