కేసీఆర్‌ పేరుతో బ్లాక్‌మెయిలా...ఎమ్మెల్యేపై కేటీఆర్‌ ఫైర్‌

కేసీఆర్‌ పేరుతో బ్లాక్‌మెయిలా...ఎమ్మెల్యేపై కేటీఆర్‌ ఫైర్‌

రాజు కత్తికి రెండు పక్కలా పదును అంటారు పెద్దలు. ఇప్పుడది తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విషయంలో నిజమైంది! ఎప్పుడు ఎంతో సౌమ్యంగా, దూరదృష్టితో ఆలోచించి మరీ మాట్లాడే కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌కు ఒక విషయంలో పట్టరాని ఆగ్రహం వచ్చింది. అదీ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే అందునా.. తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని చెప్పినప్పుడే! భలే చిత్రంగా ఉందికదూ ఘటన. మరి కేటీఆర్‌ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో? సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఏ నిర్ణయం ఆయనకు ఆగ్రహం తెప్పించిందో చూద్దాం. రాష్ట్ర గనుల శాఖ పగ్గాలు చేపట్టిన కేటీఆర్‌ ఇటీవల కొన్ని గ్రానైట్‌ సంస్థల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి  గ్రానైట్‌ వ్యాపారంతో సంబంధమున్న కరీంనగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పుట్టా మధు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రానైట్‌ సంస్థల యాజమాన్యాలు తమ కష్టాలను కేటీఆర్‌ ముందు వెళ్లబోసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపామనే కేసులో భారీ జరిమానాలు విధించారని, అవికట్టే వరకు తమను బ్లాక్‌ లిస్టులో పెట్టారని, దీనికి పరిష్కారం చూపించాలని నెత్తీనోరూ బాదుకున్నారట సంస్థల యజమానులు. వీరి బాధను చూసి కరిగిపోయిన కేటీఆర్‌.. సరే! మీరు అక్రమంగా తవ్విన గ్రానైట్‌ ఎంత ఖరీదు ఉంటుందో అంత మేరకు జరిమానా కట్టి.. పనులు ప్రారంభించుకోండి అని అభయమిచ్చారట. దీంతో గ్రానైట్‌ సంస్థల యాజమాన్యాలు ఉబ్బితబ్బిబయ్యాయి. ఇక, ఇదే సందర్బంగా.. కేటీఆర్‌ ఓ విషయాన్ని వెల్లడించారు. ఇకనుంచి అన్ని చోట్లా ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, అధిక లోడుతో వెళ్లే గ్రానైట్‌ వాహనాలకు చెక్‌ పెడతామని అన్నారట.

ఈ సందర్భంగా కరీంనగర్‌ ఎమ్మెల్యే కమలాకర్‌ జోక్యం చేసుకుంటూ గతంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌ చెక్‌పోస్టులను ఎత్తివేశారని గుర్తుచేశారట. గంగుల ఈ విషయాన్ని మొదటిసారి ప్రస్తావించినప్పుడు కేటీఆర్‌ వినీవిననట్టుగా వదిలేశారట. కానీ గంగుల ఇదే అంశాన్ని మరోసారి గట్టిగా పునః ప్రస్తావించారట. దీంతో మంత్రి కేటీఆర్‌కి ఎక్కడలేని ఆగ్రహం తన్నుకొచ్చిందట. ''పదే పదే ముఖ్యమంత్రి పేరు చెప్పి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నావా?'' అంటూ సీరియస్‌ అయ్యారట. దీంతో గంగుల నోటిపై వేలేసుకుని సమావేశం ముగిసే వరకు కామ్‌గా కూర్చున్నారట. అనంతరం, సమావేశం నుంచి బయటకు వచ్చాక.. సీఎం తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడితే.. ఎందుకంత సీరియస్‌ అంటూ.. కేటీఆర్‌ వైఖరిపై కస్సుబుస్సులాడాడట కమలాకర్‌. అదికూడా బహిరంగంగా కాదులేండి. తనకు అత్యంత ఆప్తులు అనదగ్గవారి చెంతనే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English