లోక్‌స‌భ‌లో రెచ్చిపోనున్న టీడీపీ యువ ఎంపీ

లోక్‌స‌భ‌లో రెచ్చిపోనున్న టీడీపీ యువ ఎంపీ

రాజ‌కీయాల్లో ఎవ‌రి మైలేజీ వారిది. ఎంత మైలేజీని సొంతం చేసుకుంటే.. అంత లాభం. ఇప్పుడు ఈ సూత్రాన్నే అనుస‌రించి త‌న మైలేజీని అమాంతం పెంచుకునేందుకు య‌త్నిస్తున్నారు టీడీపీ యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న‌నాయుడు. ప్ర‌స్తుతం ఏపీకి చెందిన ఎంపీల‌కు(ఆపార్టీ ఈ పార్టీ అనికాదు. అన్ని పార్టీలు) ప్ర‌త్యేక హోదా అంశం హాట్ టాపిక్‌. దీనిపై ఎంత‌గా స్పందిస్తే.. అంత మైలేజీ. దీంతో యువ ఎంపీ కింజ‌రాపు కూడా త‌నదైన పంథాలో గ‌ళం విప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు రాజ్య‌స‌భ‌లో ప్రైవేటు బిల్లు ప్ర‌వేశ పెట్టారు. దీంతో ఆయ‌నకు అంతులేని మైలేజీ వ‌చ్చింది. అస‌లు ఆయ‌న బిల్లుకు జై కొట్ట‌క‌పోతే, ఇబ్బంద‌నే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు దీనిని అందిపుచ్చ‌కున్న టీడీపీ యువ ఎంపీ రామ్మోహ‌ననాయుడు.. ఇప్పుడు ప్ర‌త్యేక హోదాపై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. ఇది ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం. ఈ క్ర‌మంలో ఆయ‌న సోమ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదాపై నోటీసు ఇచ్చారు. దీనిపై చ‌ర్చించాల‌ని స్పీక‌ర్‌ను కోరారు.  రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీని ఆదుకునే బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన సదరు నోటీసులో పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ పక్కాగా అమలు చేయాలని ఆయన ఆ నోటీసులో డిమాండ్ చేశారు.

  ఈ ప‌రిణామం రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీసింది. ఇంత చిన్న వ‌య‌సులోనే పెద్ద మ‌న‌సుతో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేయ‌డంతో పార్టీల‌కు అతీతంగా రామ్మ‌నోహ‌ర్‌నాయుడుపై ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ మాత్రం ఆలోచ‌న మిగిలిన ఎంపీల‌కు ఎందుకు రాలేద‌ని కూడా రాజ‌కీయ విశ్లేష‌కులు, మేథావులు చ‌ర్చించుకుంటున్నారు. ఏదేమైనా ప్ర‌జా స‌మ‌స్య‌లు, రాష్ర్ట స‌మ‌స్య‌ల విష‌యంలో తన తండ్రి, దివంగ‌త కేంద్ర మంత్రి కింజార‌పు ఎర్ర‌న్నాయుడు బాట‌లోనే ఆయ‌న త‌న‌యుడు రామ్మ‌నోహ‌ర్‌నాయుడు కూడా న‌డ‌వ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు