ఎన్టీవోడి పిల్లోడు బయటకొచ్చాడు

ఎన్టీవోడి పిల్లోడు బయటకొచ్చాడు

తెలుగుజాతి పౌరుషాన్ని.. ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మొదటివ్యక్తి ఎన్టీఆర్. సామాన్యుడు ప్రేమగా ఆయన్ని ఎన్టీవోడు అని పిలుచుకునే ఆయన.. తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటిగా ఉండాలని తపించేవారు. ప్రాంతాలకు అతీతంగా ప్రేమాభిమానాలు సంపాదించుకున్న ఆయన వారసులు.. తాజా అనిశ్చితిలో ఏ దిక్కుకు మొగ్గుతారన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేదే. పార్టీకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశ్యంతో ఒక అడుగు వెనక్కి వేసిన ఆయన కుమారుడు ఎంపీ హరికృష్ణ ఎట్టకేలకు బయటకొచ్చారు. తాను సమైక్యవాదినని బల్లగుద్ది మరి చెప్పారు. ‘తెలుగుజాతి వికాసం.. ఆత్మాభిమాన పరిరక్షణ కోసం చైతన్యరథంపై తారకరాముడు ప్రజల ముందుకొచ్చినప్పుడు తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.. చేయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ నాన్నతో పాటు నడిచిన రోజులు గుర్తుకువస్తున్నాయి. ఇవన్నీ కలవరాన్ని కలిగిస్తున్నాయి. నిద్రల్లేని రాత్రుల్ని మిగిలిస్తున్నాయి. తండ్రి ఆలోచనలను ఆచరించటం.. ఆయన ఆశయాల్ని కొనసాగించటం కొడుకుగా నా తక్షణ కర్తవ్యం. నరనరంలోనూ సమైక్యతను జీర్ణించుకున్న తారకరాముని బిడ్డగా, ఆవేదన నిండిన గుండెతో సమైక్యాంధ్ర విధానానికి కట్టుబడటం సమంజసంగా భావిస్తున్నా’ అంటూ తన మనోభావాల్ని బయటపెట్టారు.

ఎన్టీవోడి వారసులమని చెప్పుకునే వారు.. ఆయన ఆశయాలకు మాత్రం వారసుల్లేరా అనుకునేవాళ్లకి హరికృష్ణ తాజా వ్యాఖ్యలు సంతోషాన్ని నింపితే.. కేవలం తండ్రి పేరు చెప్పుకొని దాదాపు ఎనిమిదిన్నరేళ్లకు పైనే కేంద్ర సహాయ మంత్రి పదవిని అనుభవిస్తున్న పురంధేశ్వరి కూడా అన్న అడుగుజాడల్లో నడవాల్సి ఉంది. తమ కుటుంబాన్ని అభిమానించే తెలుగు ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఒక జాతి ఏది మంచి.. ఏది చెడు అన్న విషయం తేల్చుకోలేని సంకట స్థితిలో ఉన్నప్పుడు చిటికెన వేలు అందించి.. ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి తప్పించాల్సిన బాధ్యత ఎన్టీవోడు వారసులపైన ఉంది. ఆలస్యంగానైనా తెలివి తెచ్చుకున్న హరికృష్ణ తన తప్పును తెలుసుకున్నారు బానే ఉంది. మరి చిన్నమ్మ ఇప్పటికైనా పదవీత్యాగం చేస్తారా? లేక.. ఢిల్లీ లోని పార్టీ అధినాయకత్వానికి తెలుగోడి గోసను అర్థమయ్యేలా చెబుతారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు