అయిదుగురు మంత్రుల పేషీల్లో కేసీఆర్‌ నిఘా

అయిదుగురు మంత్రుల పేషీల్లో కేసీఆర్‌ నిఘా

ఇటీవల కాలంలో రాజకీయాల్లో డిటెక్టివ్‌ పనులు పెరిగిపోయాయి. నిఘా కెమేరాల నీడలో రాజకీయాలు జరుగుతుండడంతో అందరూ జాగ్రత్త పడుతున్నారు. నిఘాతో మంచి ఫలితాలు పొందిన నేతలు అన్ని విషయాల్లో అదే మార్గం అనుసరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన నిఘా నెట్‌ వర్కుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును, టీడీపీని ఓటుకు నోటు కేసులో ఇరికించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన కేబినెట్లోని అయిదుగురు మంత్రుల సిబ్బందిపై నిఘా పెట్టారట. అందులో తన కుమారుడు, మేనల్లుడు శాఖలు కూడా ఉండడం విశేషం. మొత్తం అయిదుగురు మంత్రుల శాఖల్లో కేసీఆర్‌ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ఆంగ్ల మీడియాలో ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి.

కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్న విమర్శలు అధికకమవుతున్న సంగతి తెలిసిందే. వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు చెందిన ఫైళ్లను కదిలించాలంటే  మంత్రుల వద్ద పనిచేస్తున్న సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే దీనిపై కేసీఆర్‌ ఒకటిరెండుసార్లు మంత్రులను హెచ్చరించారు. మీమీ శాఖల్లో అవినీతిని కంట్రోలు చేయాలంటూ సూచించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయనే రంగంలోకి దిగుతున్నట్లు చెబుతున్నారు.

మంత్రులు బయట తిరుగుతూ ఉండటం వల్ల ఫైళ్లు క్లియర్‌ కావడం లేదని, సీఎం పేషీకి వెళ్లాల్సిన ఫైల్స్‌ ను కదిలించేందుకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నట్టు కేసీఆర్‌ దృష్టికి వచ్చిందట.  దీంతో తన కుమారుడు కేటీఆర్‌ చూస్తున్న ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ.. మేనల్లుడు హరీశ్‌ రావు చూస్తున్న నీటి పారుదల శాఖ సహా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, విద్యా మంత్రి కడియం శ్రీహరిల పేషీలపై సీఎం ప్రత్యేక నిఘాను పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ విషయం బయటకు రాగానే మంత్రులు పేషీల్లోని అధికారులు వెంటనే జాగ్రత్త పడిపోయారట. అయినా.. భారీ చేపలను పట్టుకుని అందరికీ హెచ్చరికలు పంపాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు