రేవంత్ రెడ్డి గిల్లితే కిషన్ రెడ్డి కరిచేశాడు..

రేవంత్ రెడ్డి గిల్లితే కిషన్ రెడ్డి కరిచేశాడు..

కేంద్రంలో, ఏపీలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, తెలుగు దేశం పార్టీల మధ్య సంబంధాలు నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వాల్లో కలిసి సాగుతున్నా ఒక్కోసారి అవి అధికార, విపక్షాల్లా విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీలో ఈ ధోరణి ఉండగా తెలంగాణలో అయితే ఆ రెండు ఏదో ఒక స్థాయిలో మిత్ర పక్షాలన్నట్లుగా ఉండనే ఉండవు. తెలంగాణలో కలిసి సాగకపోయినా కేంద్రంలో రెండూ మిత్రపక్షాలన్న కనీస ఆలోచన లేకుండా రెండు పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీపై రేవంత్ రెడ్డి నోరు పారేసుకోగా... కిషన్ రెడ్డి కూడా తన వ్యాఖ్యలతో టీడీపీ పరువును తీసిపడేశారు. కలిసి పనిచేయాల్సిన రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ తరహా మాటల తూటాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న బిజెపి, ఆ ఎదుగుదలకు టిడిపి ఆటంకం కలిగిస్తుందనే భావనకు రావడంతోనే మాటల తూటాలు పేలుతున్నాయని తెలుస్తోందవి.

రీసెంటుగా రేవంత్ రెడ్డి బీజేపీపై తరచూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.  రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీని కూడా పూచికపుల్లలా తీసిపడేశారు. ‘ఆ పార్టీయే లేదు, లేని పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై ఏమని స్పందించాలి..’ అని ఏకిపడేశారు. టిఆర్‌ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుబంధ సంఘాలుగా మారాయని, ఇక ఆ పార్టీలు ఉండి ప్రయోజనం ఏమిటంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.

తెలుగుదేశం పార్టీకి నేతలు, క్యాడర్ అంతా పోయిందని... ఉనికే లేని పార్టీ గురించి, ఆ నేతల గురించి ఏం మాట్లాడుతామని కిషన్ రెడ్డి అనడం రాజకీయంగా కలకలం రేపింది. సాధారణంగా నేతలతో విభేదాలు వచ్చినప్పుడో, విమర్శలు వచ్చినప్పుడో అదే లైన్లో విమర్శలు చేసే కిషన్ రెడ్డి ఈసారి ఏకంగా తెలుగు దేశం పార్టీపైనే విమర్శలు గుప్పించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తెలంగాణలో పట్టు సాధించడం కోసం రెండు పార్టీలూ ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విమర్శలు ఇంత పదునుగా ఉంటున్నాయని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు