పాత‌ది వ‌దిలేసి కొత్త సినిమాల డేట్లిస్తాడేంటి?


బాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేసే స్టార్ హీరో అక్ష‌య్ కుమార్. గ‌త కొన్నేళ్ల‌లో క‌రోనా మాత్ర‌మే ఆయ‌న జోరుకు అడ్డుక‌ట్ట వేసింది. మిగ‌తా టైం అంతా తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. ఎంత స్పీడుగా సినిమాలు చేసినా.. క్వాలిటీ మెయింటైన్ చేయ‌డం అక్ష‌య్‌కే చెల్లింది. గ‌త ఏడాది క‌రోనా లేకుంటే అక్షయ్ సినిమాలు క‌నీసం మూడైనా రిలీజ‌య్యేవి. ఆ మ‌హ‌మ్మారి కార‌ణంగా ల‌క్ష్మి సినిమా మాత్ర‌మే, అది కూడా ఓటీటీలో రిలీజైంది.

క‌రోనా బ్రేక్ వేయ‌డానికి ముందు విడుద‌ల‌కు రంగం సిద్ధం చేసుకున్న అక్ష‌య్ సినిమా సూర్య‌వంశీకి పెద్ద షాక్ త‌గిలింది. థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో ఎంత‌కీ ఆ సినిమా విడుద‌లే కాలేదు. ఈ మ‌ధ్య థియేట‌ర్లు పున:ప‌్రారంభం అయినా ఆ సినిమా విడుద‌ల సంగతి తేల్చ‌ట్లేదు.

ద‌క్షిణాదిన కొత్త సినిమాలు 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతోనూ బాగానే న‌డుస్తున్నాయి. మంచి వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. బాలీవుడ్లో మాత్రం స్టార్లెవ్వ‌రూ త‌మ చిత్రాల్ని విడుద‌ల చేయ‌డానికి ముందుకు రావ‌ట్లేదు. రోహిత్ శెట్టి-అక్ష‌య్ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం మామూలు రోజుల్లో రూ.200 కోట్ల‌కు త‌క్కువ కాకుండా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంచ‌నా. అలాంటి సినిమాను 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతో రిలీజ్ చేయ‌డం ఇష్టం లేదేమో.

ఐతే ఈ సినిమా ఫ‌లానా టైంలో రిలీజ‌వుతుంద‌నే స‌మాచారం కూడా అక్షయ్ అండ్ కో ఇవ్వ‌ట్లేదు. దాని సంగ‌తి పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి కరోనా బ్రేక్ త‌ర్వాత పూర్తి చేసిన బెల్ బాట‌మ్‌, ఇటీవ‌లే మొద‌లుపెట్టిన బ‌చ్చ‌న్ పాండే సినిమాల రిలీజ్ డేట్లు మాత్రం ప్ర‌క‌టించాడు. బెల్ బాట‌మ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుద‌ల కానున్న‌ట్లు ముందు ప్ర‌క‌టించ‌గా.. తాజాగా బ‌చ్చ‌న్ పాండే రిలీజ్ డేట్ ఇచ్చారు. అది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌ట‌. ఐతే అభిమానులు మాత్రం సూర్య‌వంశీ సంగ‌తేంటో తేల్చ‌మ‌ని అక్ష‌య్ మీద ఒత్తిడి తెస్తున్నారు.