బతకలేక బుజ్జి రమ్య చనిపోయింది..

బతకలేక బుజ్జి రమ్య చనిపోయింది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఒక యాక్సిడెంట్ ఒక కుటుంబాన్ని దారుణ విషాదంలోకి నింపింది. కోలుకోలేని రీతిలో ఒక కుటుంబాన్ని పదే పదే విషాదంలోకి నెట్టేస్తుంది. తమకేమాత్రం సంబంధం లేకున్నా.. తప్పు లేకున్నా దారుణంగా నష్టపోయిన ఈ ఉదంతం విన్న ప్రతిఒక్కరూ అయ్యో అనే పరిస్థితి. తొమ్మిది రోజుల ముందు పూటుగా తాగేసిన యూత్ బ్యాచ్ కారును ఇష్టారాజ్యంగా నడిపిన కారణంగా ఒక కుటుంబం మొత్తం బాధితులుగా మారిన వైనం గుర్తుండే ఉంటుంది.

ఇంకా గుర్తుకు రావాలంటే.. పట్టపగలే తప్పతాగిన బీటెక్ విద్యార్థులు వేగంగా కారు నడుపుతూ.. అదుపు తప్పి డివైడర్ ను గుద్దుకోవటం.. అది పల్టీ కొట్టి రోడ్డుకు అవతల వైపు వెళుతున్న ఒక కారు మీద పడింది. ఈ హఠాత్ పరిణామంలో  అవతల పక్క కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కారులోని వారి విషయానికి వస్తే.. చిన్నారి రమ్య స్కూల్లో చేరిన మొదటి రోజు కావటంతో.. ఆమెను తీసుకొచ్చేందుకు ఆ చిన్నారి తల్లి.. తాత.. ఇద్దరు బాబాయ్ లు కారులో బయలుదేరి.. స్కూల్ నుంచి రమ్యను తీసుకొస్తున్న వేళ ఈ ప్రమాదం జరిగింది.

ఈ యాక్సిడెంట్ లో డ్రైవ్ చేస్తున్న రమ్య బాబాయ్ ఘటనాస్థలంలో మరణించారు. ఇక.. చిన్నారి రమ్య.. ఆమె తాత తీవ్రంగా గాయపడగా.. రమ్య తల్లి ఫ్యాక్చర్ కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తొమ్మిది రోజులపాటు మృత్యువుతో పోరాడిన చిట్టి రమ్య (9) తనకిక ఓపిక లేదంటూ మృత్యువు కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. నిన్నమొన్నటి వరకూ నవ్వుతూ.. తుళ్లుతూ తిరిగి తన బుజ్జితల్లి  చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న రమ్య తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుమార్తెను కడసారి తీసుకొచ్చేందుకు ఆమెను ఆసుపత్రి అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఫ్యాక్చర్ కారణంగా పైకి లేవలేని స్థితిలో ఉన్న ఆమె.. తన చిట్టితల్లిని విగతజీవిగా చూసి రోదించిన తీరు అక్కడి వారి మనసుల్ని కదిలించివేసింది.

ఎవరో సంబంధం లేని వ్యక్తులు.. అజాగ్రత్తగా.. బాధ్యతారాహిత్యంతో చేసిన పనికి ఆ తల్లి కుమిలిపోవటం అందరిని కలిచివేసింది. కొందరి కారణంగా ఒక కుటుంబం మొత్తం విషాద ఊబిలోకి కూరుకుపోవటం గమనార్హం. విగత జీవిగా మారిన కూతుర్ని తనివితీరా చూసే అవకాశం లేకపోవటంతో .. తన చేతులతో చిన్నారి రమ్య ముఖాన్ని తడుముడుతున్న తీరు చూసినోళ్ల కళ్లల్లో కన్నీళ్లు గిర్రున తిరిగిన పరిస్థితి. ఇలాంటి కష్టం.. నష్టం మరే కుటుంబానికి కలగకూడదని కోరుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు