కేసీఆర్‌ను రౌండప్‌ చేసేస్తున్నారు

కేసీఆర్‌ను రౌండప్‌ చేసేస్తున్నారు

తెలంగాణలో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అధికార పక్షాన్ని ఆయా పార్టీలేవీ ఢీ కొనలేకపోతున్నాయనే విమర్శలకు సమధానం ఇచ్చేందుకు విపక్షాలు రెడీ అయ్యాయి. ఒకే పార్టీగా పోరాటం చేస్తే రకరకాల అబాండాలు వేస్తూ బలహీన పర్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ ఉమ్మడి పోరాటానికి సిద్ధం అవుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలు ఎంత వరకు నెరవేర్చారు, వేటిని నెరవేర్చలేదనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి వాటిని ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి.అదే సమయంలో విపక్షాలను ఎదర్కొంటూనే ఎన్నికల హామీలను సమీక్షించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, గిరిజనులు, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ల హామీలు అమలుకు నోచుకోకపోవడంతో విపక్షాలు ప్రధానంగా వీటిని లక్ష్యం చేసుకున్నాయి. అమలుకు నోచుకోని హామీలపై ఎన్నికల్లో ఏం చెప్పారు? ఆ తరువాత ఏం చేశారు అనే విషయాలను ప్రజలకు సమర్థంగా చేరవేయటానికి కాంగ్రెస్‌ తన శ్రేణులకు శిక్షణ ఇస్తోంది.పన్నెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసి, సాగర్‌ నీటిని రెండో పంటకు విడుదల చేస్తే తాను టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎల్‌పీ నాయకుడు కె.జానారెడ్డి సవాల్‌ విసరడం ఇందులో భాగమేనంటున్నారు.

ప్రాజెక్టులను సాధిస్తామనే విషయంలో అధికార పక్షం ధీమాగా చెబుతున్నా 12శాతం రిజర్వేషన్లపై మాత్రం గట్టిగా బదులివ్వడం లేదు. 12శాతం రిజర్వేషన్లపై కమిటీ వేశాం, కమిటీ నివేదిక వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం, పార్లమెంటులో తీర్మానం చేయాల్సి ఉంటుందని చెబుతున్న తీరును ఎండగట్టనున్నారు.

టీడీపీ నేత రేవంత్‌రెడ్డి సైతం ఉమ్మడిపోరుకే ఆసక్తికనపరుస్తున్నారు. ఇటీవల తమ కార్యాలయం స్వాధీనం చేసుకునే సమయంలో ఆయన కాంగ్రెస్‌ నేతలతో కలవడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. ప్రతి అంశంపై ఆందోళనకు దిగుతున్నా, ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో నామమాత్రంగా తయారైన నేపథ్యంలో ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకంపై దృష్టిసారించాలని నిర్ణయించారు. 2.60లక్షల ఇళ్లను మంజూరు చేసినా ఇప్పటి వరకు కనీసం కాంట్రాక్టర్లను కూడా ఎంపిక చేయలేదు. ఎప్పటికప్పుడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంపై ప్రకటనలు తప్ప ఆచరణలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అన్ని ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం వెనుక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల చరిత్రలోనే గతంలో ఎవరికీ దక్కని విధంగా టీఆర్‌ఎస్‌కు 99 డివిజన్లలో విజయం దక్కడంలోనూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం ప్రధాన పాత్ర వహించింది. ఇంతటి కీలకమైన అంశంపై శీతకన్ను వేయడంపై సీరియస్‌గానే పోరాడాలని టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది.

దళితులకు భూ పంపిణీ అస్త్రాన్ని సీరియస్‌గా ప్రస్తావించాలని బీజేపీ చూస్తోంది. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు దళితులకు మూడెకరాల భూమి పంపిణీ గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవం రోజునే పంపిణీ చేశారు. ఆ తరువాత ఈ పథకం అమలులో ప్రభుత్వం నుంచి పెద్దగా ఆసక్తి కనపడలేదు. కొనుగోలు చేయడానికి సైతం భూమి అందుబాటులో లేకపోవడం వల్ల పథకం నత్తనడకన సాగుతోంది. కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం ఇంకా ఆలోచనల దశలోనే ఉందని గట్టిగా ప్రశ్నించేలా ముందుకు సాగుతోంది. మొత్తంగా కేసీఆర్‌ హామీలను ప్రస్తావిస్తూ అన్ని పార్టీలు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు