గవర్నర్ ఏం చెప్పారు? బాబు ఏమన్నారు?

గవర్నర్ ఏం చెప్పారు? బాబు ఏమన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు వీలుగా రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీ రాజధాని పర్యటనకు చేయటం తెలిసిందే. ఏదైనా ఇష్యూ మీద ముఖ్యమంత్రుల్ని తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడే గవర్నర్.. సంప్రదాయాన్ని పక్కన పెట్టి మరీ అమరావతికి బయలుదేరారు. గవర్నర్ పర్యటనకు ముందు ఆయన్ను ఒకటికి మూడుసార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కావటం తెలిసిందే.

రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలు చాలానే ఉన్నా.. ఎప్పుడూ ఇంతగా చొరవ చూపని గవర్నర్.. తాజాగా రాజుకున్న హైకోర్టు విభజన వ్యవహారంతో సీన్లోకి కేంద్రం ఎంటర్ కావటం.. ఆక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో.. ఇష్యూను క్లోజ్ చేద్దామన్న ఉద్దేశంతో మాజీ ఐబీ చీఫ్ రాజభవన్ ను వీడారు.  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన గవర్నర్.. ఏం మాట్లాడారు? అందుకు చంద్రబాబు ఏమని బదులిచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

అధికారికంగా ఈ ఇష్యూ బయటకు రానప్పటికీ.. ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన గవర్నర్.. ఏపీ సీఎంతో తన చర్చలు ఫలప్రదం అయినట్లుగా చెప్పుకొచ్చారు. భవిష్యత్ చర్చలకు ఇది దోహదం చేస్తుందన్న మాట ద్వారా.. ఇష్యూ క్లోజ్ కాలేదని.. తాను ప్రస్తావించిన అంశాలకు బాబు తన వాదనను వినిపించినట్లుగా.. దాన్ని కేసీఆర్ తో మాట్లాడాల్సి ఉంటుందన్న భావన వచ్చేలా గవర్నర్ మాటలు ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. గవర్నర్.. చంద్రబాబు మధ్య భేటీ ఎలా సాగింది? ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? లాంటి అంశాల్లోకి వెళితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించాలని గవర్నర్ కోరితే.. అందుకు స్పందించిన చంద్రబాబు.. ముందు రెండు రాష్ట్రాలమధ్య ఉన్న వివాదాల్ని పరిష్కరించాలన్న వాదనను తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రతిసారి సుప్రీంకోర్టుకు వెళ్లటం సాధ్యం కాదని.. అందుకే ఉమ్మడి హైకోర్టు ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

రెండు రాష్ట్రాల మద్య వివాదాలన్ని పూర్తి అయ్యాక హైకోర్టు విభజన జరిగితే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్న విషయాన్ని బాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదట వివాదాస్పద అంశాల పరిష్కారం మీద దృష్టి పెట్టాలని బాబు అడిగితే.. అదేదో హైకోర్టు విభజనతో మొదలు పెట్టొచ్చుగా అని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. విభజన సమస్యలు అన్ని ఒక్కసారిగా పరిష్కారం కావుగా అన్న వాదనను గవర్నర్ ప్రస్తావిస్తే.. ముందుగా ముఖ్యమైన అంశాలపై పరిష్కారం కనుగొంటే రెండు రాష్ట్రాల మధ్య సానుకూలత పెరుగుతుందని.. మిగిలినవి తర్వాత పరిష్కరించుకోవచ్చన్న మాటను చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయాల్ని కేసీఆర్ తో భేటీ అయ్యాక.. మరోసారి చర్చలు జరపాలన్న దగ్గర వారి సమావేశం ముగిసినట్లుగా చెబుతున్నారు. అనధికారికంగా చెబుతున్న ఈ సమాచారం ఎంత నిజం అన్నది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలతో అర్థం చేసుకోవచ్చని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు