డీఎస్ కొత్త వ్యూహం..

డీఎస్ కొత్త వ్యూహం..

ఏమాత్రం ఇష్టం లేని దానిపై ఇష్టం పెరిగేలా చేసుకోవాలంటే.. మేనేజ్ మెంట్ సర్కిల్స్ లో  ఓ సింఫుల్ థియరీ చెబుతారు. అదేమంటే.. నచ్చని దాన్లోని మంచి గుణాల గురించి ఒకటికి పదిసార్లు మనసులో అనుకోవటమే. దాని ద్వారా.. మనసులో ఒకలాంటి సానుకూలత ఏర్పడి.. నచ్చనిది కూడా నచ్చేలా చేయొచ్చని చెబుతారు. సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు డి. శ్రీనివాస్. రాష్ట్ర విభజనను ఏమాత్రం ఒప్పుకోని సీమాంధ్రుల మనసుల్ని మార్చేందుకు ఆయన సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. విభజన జరిగితే.. సాగునీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి బెంగ పడుతున్నసీమాంధ్రులు సైతం.. టెంప్ట్ అయ్యేలా సీమాంధ్ర గొప్పతనాన్ని చెప్పుకొస్తున్నారు. ఒక్కసారి డీఎస్ మాట వింటే.. మనకేం తక్కువ, వాళ్లు పొమ్మంటమేంటి? మనమే పోదామని  అనుకునేటట్లు ఆయన ఒక వాదనను సిద్ధం చేశారు. దాని ప్రకారమేమంటే.. రాష్ట్ర విభజన జరిగితే.. లాభ పడేది సీమాంద్రే తప్ప తెలంగాణ కాదని ఆయన వాదిస్తున్నారు. తన వాదనకు బలం చేకూరేందుకు కొన్ని అంశాలను తెరపైకి తెస్తున్నారు. దాని ప్రకారం..

‘‘నాలుగైదు రాజధానులు నిర్మించుకునేందుకు కావాల్సిన వనరులు సీమాంధ్రలో ఉన్నాయి. వ్యాపార రాజధానిగా బెజవాడ, ఐటీలో వైజాగ్, పారిశ్రామికంగా కడప, విద్యలో గుంటూరు,  అధ్యాత్మికంగా తిరుపతి.. ఇలా ఎన్నో నగరాలు విడిపోతే అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.  సీమాంధ్రలో విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, పుట్టపర్తి, కడపల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ మినహా మరెక్కడా ఎయిర్ పోర్టులు లేవు. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తదితర ఓడరేవులు ఉన్నాయి. అపార సహజవాయు నిక్షేపాలతో వాణిజ్యపరంగా సీమాంధ్ర గణనీయంగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత సీమాంధ్ర సోదరులు ఒక్క సెకను కాలం కూడా వెనుకంజవేయరు’’ అంటూ పెద్ద లిస్టే చెబుతున్నారు. ఇన్ని చెబుతున్నారు బానే ఉంది.. మరి కలిసి ఉండొచ్చు కదా అంటే మాత్రం ఆయన జవాబివ్వరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు