టెర్ర‌రిస్టుల‌ మ‌ద్ద‌తుతో బంగారు తెలంగాణ‌?

టెర్ర‌రిస్టుల‌ మ‌ద్ద‌తుతో బంగారు తెలంగాణ‌?

సుదీర్ఘ కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, హిందు నాయకుడు రాజాసింగ్‌ లోథ్‌ ఎంఐఎం తీరుపై విరుచుకుపడ్డారు. పాతబస్తీలో ఐసిస్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా, మినీ పాకిస్తానులా మారిపోయిందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆర్థికంగా కూడా ఎంఐఎం సపోర్ట్‌ చేస్తుందని ఆరోపించారు. తనకు టెర్రరిస్టు అంటే కోపమని, ఎంఐఎం అంటే కోపమని ప్రకటించారు. తన టార్గెట్‌ ఎంఐఎం అని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మిత్రపక్షమైతే మజ్లిస్‌కు టెర్రరిస్టు  మిత్రపక్షమని రాజాసింగ్‌ చెప్పారు. టెర్రరిస్ట్‌ లకు  అన్ని విధాలుగా సపోర్ట్‌ చేస్తాం అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌  ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తీవ్రవాది వికారుద్దిన్‌ శవయాత్రలో ఎంఐఎం నేతలు పాల్గొన్నారని , ఇపుడు ఇలా ప్రకటన చేయడం ఏం సంకేతాలు ఇస్తోందని ప్రశ్నించారు. ఎంఐఎం నాయకులు బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు ప్రకటిస్తున్నారనేందుకు ఇంతకంటే ఉదాహరణలు కావాలా అని వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులకు సపోర్ట్‌ చేసే పార్టీతో సంబంధం పెట్టుకుంటే ఎలా బంగారు తెలంగాణా సాధ్యమని రాజాసింగ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ పార్టీకి హిందువులు ఓటు వేయలేదా? ముస్లిం ఓట్లతోనే కేసీఆర్‌ సీఎం అయ్యాడా? అంటూ నిలదీశారు.

తెలంగాణా, భారత్‌ సురక్షితంగా ఉండాలంటే  ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఓవైసీపై దేశ ద్రోహం కేసు పెట్టడమే కాకుండా ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. నాలుగు రోజుల్లో ఢిల్లీకి వెళ్తున్నానని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కు హైదరాబాద్‌ ఉగ్రవాదంపై నివేదిక ఇస్తానని ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు