జైలుకెళ్తానంటున్న చినబాబు

జైలుకెళ్తానంటున్న చినబాబు

తనపై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆరోపణలు నిజమని రుజువు చేస్తే తాను జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని టిడిపి నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అన్నారు. నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే వాటిని రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఈ రోజు విజయవాడలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. స్విస్ చాలెంజి విధానంలో రాజధాని పనులు కేటాయింపులపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని లోకేశ్ ఆరోపించారు. కులం, ప్రాంతం పేరుతో ప్రతిపక్షాలు ప్రజల్లో చిచ్చుపెడుతున్నాయని ఆయన అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు సాధించి తీరుతామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆయన చెప్పారు. విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మరాదన్న లోకేశ్.. తనపై ఎన్నో ఆరోపణలు గుప్పిస్తూ టీడీపీని దెబ్బతీయాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కులాల పేరుతో చిచ్చు పెడుతున్నాయన్నారు. కావాలని కాపు సోదరుల సభలో ట్రైనుని తగులబెట్టారని ఆయన ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మించడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారని.. గతంలో కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రతిపక్ష నేత జగన్ సింగపూర్ కంపెనీలకు లేఖ రాశారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్షం ఎక్కడా భాగస్వామ్యం కాలేకపోయిందని ఆరోపించారు. పారదర్శక పాలన అందిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని లోకేష్ హెచ్చరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు