డిప్యూటీ సీఎంతో సహా 65 అధికార ఎమ్మెల్యేలు అరెస్ట్

డిప్యూటీ సీఎంతో సహా 65 అధికార ఎమ్మెల్యేలు అరెస్ట్

లోకమంతా ఒక తీరు అయితే ఢిల్లీ పోలీసుల తీరు మరోలా ఉంది. ఒక ఆరోపణ విషయంలో అవసరానికి మించిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ఢిల్లీ పోలీసులు ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగా వారు చేసిన పని మరింత చర్చకు కారణంగా మారింది. అధికారపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యేను అభ్యంతరకర రీతిలో అరెస్ట్ చేశారు. ఒక మహిళను తిట్టారన్న ఫిర్యాదుతో ఢిల్లీకి చెందిన అమ్ ఆద్మీ ఎమ్మెల్యేను విలేకరుల సమావేశం మధ్యలో అరెస్ట్ చేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి.. 65 మంది ఎమ్మెల్యేల్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ ఎమ్మెల్యే దినేష్ ను అరెస్ట్ చేయటం.. తమ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు పెట్టటంపై నిరసించిన ఆప్ నేతలు ప్రధాని మోడీ నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు.. ఆప్ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

దీనికి ముందు కాసింత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తమ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రధాని మోడీ ముందు పోలీసులకు లొంగిపోతారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. ఆయన ప్రకటన తర్వాత ప్రధాని మోడీ నివాసం వైపు ర్యాలీ జరిగింది. ఇక.. సిసోడియా మీద కేసు విషయానికి వస్తే.. ఘజియాబాద్ లోని మండీ వ్యాపారుల్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం తిట్టారంటూ ఫిర్యాదు చేయటంతో ఆయనపై కేసు నమోదు చేశారు.

అదేం చిత్రమో కానీ.. మంచినీళ్ల కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన ఒక మహిళను ఆప్ ఎమ్మెల్యే తిట్టేశారంటూ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు కాగా.. వ్యాపారుల్ని తిట్టిన ఆరోపణల మీద డిప్యూటీ ముఖ్యమంత్రి మీద కేసు నమోదు కావటం ఢిల్లీలోనే సాధ్యమవుతుందేమో. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షంపై పోలీసుల వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా ఉన్నాయనటంలో సందేహం లేదనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు