ఆమరణ దీక్ష వెనకున్న వ్యూహమిదే..

ఆమరణ దీక్ష వెనకున్న వ్యూహమిదే..

రాష్ట్ర విభజన నిర్ణయంపై చిత్రమైన వాదన చేయటంలో వైఎస్సార్ కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా. విషయాన్ని సూటిగా చెబుతూ.. అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత అన్నట్లుగా.. వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ప్రయోజనం ఉంటుందా? ఆ పార్టీ అధినేత జగన్, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మలు.. తమ పదవులకు ఇటీవలే రాజీనామా చేశారు. అంతులేని అనిశ్చితితో సాగిపోతున్న తాజా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైఎస్సార్ వేసిన ఎత్తుగడే.. తాజా ఆమరణ దీక్షగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం విభజన నిర్ణయం తీసుకున్న వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ గతంలో తాను తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా స్పందించటం తెలిసిందే.దీనికి ఆగ్రహించిన ఆ పార్టీ తెలంగాణ నేతలు పార్టీకి రాజీనామా చేసేసి వెళ్లిపోవటం తెలిసిందే. తెలంగాణ మొత్తంలో దాదాపుగా ఆ పార్టీ నాయకత్వం ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో.. తమ రాజకీయ లబ్థికి సీమాంధ్ర మీద దృష్టి పెట్టిన వైఎస్సార్ నేతలు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే విజయమ్మ ఆమరణ దీక్ష. విభజన సమన్యాయంతో జరగాలన్న డిమాండ్ తో ఆమె దీక్షలో కూర్చోనున్నారు. ఇప్పటివరకు పార్టీలకు అతీతంగా ప్రజలు చేస్తున్నసీమాంధ్ర ఉద్యమాన్ని.. తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటానికి.. తమ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ మీద ఒత్తడి పెంచటం.. అధికారం పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటమే దీక్ష్ లక్ష్యమని చెప్పొచ్చు. అయితే.. దీని వల్ల జరిగే పరిణామాలేమిటంటే.. చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం తమ రాజకీయ లబ్థి మాత్రమే చూసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. విజయమ్మ దీక్ష ద్వారా ఎదురయ్యే మరిన్ని చిక్కుముడులను ఆహ్వానిస్తున్నట్లే చెప్పొచ్చు.

సమస్యకు పరిష్కారం వెతకాల్సిన సమయంలో.. ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరించటం మూడు ప్రాంతాలకు ఏమాత్రం మంచిది కాదు. ప్రజలు ఆవేశంతోనూ.. భావోద్వేగంతోనూ ఉన్నప్పడు.. నిజమైన నాయకుడు వారిని సరైన దిశానిర్దేశం చేస్తాడే తప్ప.. వారిని మరింత రెచ్చగొట్టేలా చేయరు. ఇప్పుడు విజయమ్మ దీక్షతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఆమె ఆరోగ్యం విషయమించే వరకు ఉపేక్షించే ప్రభుత్వం.. ఏ అర్థరాత్రో ఆమెను బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తారు. ఈ సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక కేంద్రం తొందరపాటుతో వ్యవహరిస్తే.. తెలంగాణ భగ్గుమనటం ఖాయం. ఈమొత్తం ఎపిసోడ్ లో ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ సీమాంధ్రలో అనూహ్యంగా ఊపందుకోవటం ఖాయం. లేని పక్షంలో కాంగ్రెస్ అధినాయకత్వం తన నిర్ణయం ప్రకటించిన రెండువారాల తర్వాత దీక్షను ప్రకటించటం ఏమిటి? ఎందుకంటే.. సీమాంధ్ర ఉద్యమాన్ని ఏ పార్టీ నడిపించటం లేదు. ప్రజలే నాయకులుగా సాగిపోతుంది. దాన్లో లీడ్ రోల్ ను చేజిక్కించుకోగలిగితే.. సీమాంధ్రలో పార్టీని మరింత పటిష్ఠం చేయొచ్చు. దీంతోపాటు.. ఇప్పటివరకు ఏ పార్టీ అండ లేని ఉద్యమకారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవటం ఖాయం. అంతిమంగా.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మార్చటం.. మరిన్ని చిక్కుముడులు వేయటానికి మాత్రమే విజయమ్మ దీక్ష పనుకొస్తుందే తప్ప.. సమస్య పరిష్కారానికిక మాత్రం మార్గం చూపదని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు