లెక్కల ఆరాబీ కోదండరాం నోట ఆర్టీసీ మాట

లెక్కల ఆరాబీ కోదండరాం నోట ఆర్టీసీ మాట

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్‌ కోదండరాం ఈ మధ్యన ప్రజా సమస్యల మీద తరచూ గళం విప్పుతున్నారు. ఆ మధ్యన ప్రజాసమస్యల్ని ప్రస్తావిస్తూ.. వాటిని పరిష్కరించటం చేతకాకపోతే అధికారం నుంచి దిగి పోవచ్చుకదా? అంటూ సూటిగా అనేసిన మాట తెలంగాణ రాష్ట్ర సర్కారును ఎంత తీవ్రంగా గాయపరిచిందన్నది.. తర్వాత కోదండరాం మీద జరిగిన మాటల దాడే నిదర్శనం. అనంతరం ఆచితూచి మాట్లాడుతున్నకోదండరాం తాజాగా ఆర్టీసీని బతికించుకునేందుకు కార్యాచరణ ప్రభుత్వం నుంచి రావాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తాజాగా బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సుకు హాజరైన కోదండరాం ఆర్టీసీని లాభాల బాట పట్టించుకునేందుకు కార్యాచరణ అవసరమన్నఆయన ఒక సూటి ప్రశ్నను సంధించారు. ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లిస్తున్న పన్నుల పైనా వివరాల్ని వెల్లడించాల్సిందిగా కోరారు. ఆర్టీసీని బతికించుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించిన తీరులో కోదండరాం మాటలు ఉన్నాయని చెప్పాలి. మరి.. కోదండం మాష్టారి డౌట్‌ కు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.